కేరళలోని ఓ ఊరు చేయూది కావులో అజయన్ (టోవినో థామస్) ఎలక్ట్రీషియన్. అతని తాత (మణియన్) దొంగ కావడంతో ఊరిలో ఎవరి వస్తువులు పోయినా అతని మీద సందేహం వస్తుంది. అవమానాలు ఎదుర్కొంటాడు.
అజయన్ తాత మణియన్ (టోవినో థామస్) ఎన్ని దొంగతనాలు చేసినా ఎవ్వరికీ దొరకదు. ఊరిలో మహిమాన్వితమైన అమ్మవారి విగ్రహం శ్రీభూది దీపం దొంగతనం చేసి దొరికిపోతాడు.
మణియన్ మరణించిన కొన్నేళ్ళకు అమ్మవారి విగ్రహం దొంగిలించడానికి సుదేవ్ వర్మ (హరీష్ ఉత్తమన్) ఆ ఊరిలో అడుగు పెడతాడు. విగ్రహం దొంగతనం అజయ్ మీద వేయడానికి ప్లాన్ చేస్తాడు.
అమ్మవారి విగ్రహాన్ని సుదేవ్ కొట్టేస్తాడు. అయితే అది నిజమైన విగ్రహం కాదని తెలుస్తుంది. అసలు విగ్రహం ఎక్కడ ఉంది? అది తెలిసి సుదేవ్, అజయన్ ఏం చేశాడు? లక్ష్మి (కృతి శెట్టి)తో అజయన్ ప్రేమకథ, సురేష్ (బసిల్ జోసెఫ్) పాత్ర ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
కేలు, మణియన్, అజయన్... మూడు పాత్రల్లో టోవినో థామస్ అద్భుతంగా నటించారు. అయితే మణియన్ నటన ఎక్కువ నచ్చుతుంది. యాక్షన్ సీన్లు సైతం బాగా చేశారు.
'ఏఆర్ఎమ్'కు దిబు నినన్ థామస్ సంగీతం, జోమోన్ టి జాన్ ఛాయాగ్రహణం బలంగా నిలిచాయి. పాటలు - నేపథ్య సంగీతంతో దిబు, లైటింగ్ - ఫ్రేమింగ్‌తో జాన్ ప్రతి సన్నివేశాన్ని కొత్తగా మలచడానికి ప్రయత్నించారు.
నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను దర్శక రచయితలు బాగా ఎంగేజ్ చేశారు. కానీ, ఎఫెక్టివ్‌గా తీయాల్సిన సన్నివేశాలను, భావోద్వేగాలను పూర్తిగా చూపించడంలో ఫెయిల్ అయ్యారు. లవ్ స్టోరీ సైతం అంత గొప్పగా లేదు. టైమ్ లైన్స్ క్లారిటీగా చూపించలేదు.
టోవినో థామస్ ట్రిపుల్ ధమాకాతో పాటు సంగీతం, కెమెరా వర్క్ కోసం 'ఏఆర్ఎమ్'ను ఒకసారి చూడొచ్చు. మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.