పిల్లలతో ఇలాంటి మాటలు అనవద్దు పిల్లలను పెంచాలంటే ఎంతో ఓపిక కావాలి. అంతకుమించి ప్రేమ ఉండాలి. ఒక్కోసారి పనుల ఒత్తిడి వల్ల పిల్లలను కసురుకుంటుంటారు తల్లిదండ్రులు. వారిని తిట్టినప్పుడు చాలా జాగ్రత్తగా మాటలను ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంది. ‘నువ్వుంటే మాకు ఇష్టం లేదు’, ‘నువ్వు పుట్టాలని నేను కోరుకోలేదు’, ‘ప్లానింగ్ లేకుండా పుట్టావు’, ‘ఎందుకు పుట్టావు మాకు’..ఇలాంటి మాటలు ఎప్పుడూ అనకండి. నవ్వుతూ కూడా అలాంటి మాటలు మాట్లాడవద్దని చెబుతున్నారు చైల్ట్ సైకాలజిస్టులు. ఇలాంటి మాటలు వింటే మనసులో కుంగుబాటుకు గురవుతారు. నువ్వు వద్దు, నువ్వు పో, నువ్వు ఇలా, నీ వల్లే మా జీవితం ఇలా అయింది... ఇలాంటి మాటలు వారిలో నిరాశను పెంచేస్తాయి. ముఖ్యంగా ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఒకరి గురించే ఇలా మాట్లాడడం కూడా వారిలో ద్వేషభావం, కోపం, నిరాశ, మానసిక ఆందోళనలను పెంచుతాయి. పిల్లలను పెంచడం అనేది నిత్య అభ్యాసమనే చెప్పాలి.