మాఘ పూర్ణిమ రోజు సముద్రస్నానం చేస్తే!



నదీనాం సాగరో గతి
సకల నదీ, నదాలు చివరకు సముద్రంతోనే సంగమిస్తాయి. అందుకే సముద్రస్నానం చేస్తే సకల నదులలోనూ స్నానం చేసిన పుణ్యఫలం దక్కుతుంది.



సముద్రుడి ప్రత్యేకత ఏంటటే నిత్యం సూర్యకిరణాలవల్ల, ఎంత నీరు ఆవిరి అవుతున్నా సముద్రం పరిమాణం తగ్గదు. అలాగే, ఎన్నో జీవనదులు తనలో కలుస్తున్నా సాగరుని పరిమాణం పెరగదు.స్థిరత్వం ఆయన ధర్మం. అఘాది, జడత్వాలు ఆయన తత్త్వం.



సంవత్సరంలో నాలుగుసార్లు సాగరస్నానం చేయాలనీ, అవి కూడా ఆషాఢ పూర్ణిమ, కార్తీక పూర్ణిమ, మాఘపూర్ణిమ, వైశాఖ పూర్ణిమ''రోజుల్లో చేయాలని..అలా సాగర స్నానాలు చేసిన వారికి సముద్రుడు సంపూర్ణ ఆరోగ్యం కలుగజేస్తాడని పురాణాల్లో ఉంది



నదీప్రవాహ వేగానికి ఎదురుగా నడుము మునిగే వరకూ నిల్చుని కనీసం 48 నిమిషాల పాటు స్నానం చేయాలని విధి. అది కూడా సూర్యోదయానికి గంటన్నర ముందు కాలంలోనే చేయాలి.



సూర్యోదయకాలం నుంచి, సూర్యాస్తమయం వరకూ ప్రసరించే సూర్యకిరణాలలోని విద్యుచ్చక్తిని నదీజలాలు, సాగర జలాలు తమలో నిక్షిప్తం చేసుకుంటాయి. చంద్రుడు తన కిరణాలలోని అమృతత్త్వాన్ని, ఔశదీ విలువలను నదీజలాలకు అనుగ్రహిస్తాడు.



నీటిలో ఉండే ఈ అద్భుతశక్తులు ... తిరిగి సూర్యకిరణాలకు పరావర్తనం చెంది అంతరించి పోతాయి. అందుకే సూర్యోదయానికి ముందే స్నానం పూర్తి చేయాలనే నియమాన్ని విధించారు పెద్దలు.



సముద్రం, నదుల్లో స్నానమాచరించలేనివారు బావుల దగ్గరగానీ, చెరువుల వద్దగానీ గంగ, సింధు, కావేరి, కృష్ణ, గౌతమి'' నదుల పేర్లు స్మరిస్తూ స్నానం చేస్తే ఆయా నదుల్లో స్నానం చేసిన ఫలితం వస్తుంది.



ఈ మాఘమాసం మొత్తం పవిత్రస్నానాలు చేయడానికి వీలు కుదరకపోతే, మాఘమాసం చివరి మూడురోజులైనా పవిత్రస్నానాలు చేస్తే మంచి ఫలాన్ని పొందుతారు.



చివర మూడుస్నానాలనూ అంత్యపుష్కరిణీ స్నానాలు'' అంటారు. సాధారణ స్నానం శరీర మలినాన్ని పోగొడితే, మాఘమాసం, మనసులోని మాలిన్యాన్ని పోగొట్టి మాధవుని సన్నిధికి చేరుస్తుంది.



పూర్ణిమ'' దైవసంబంధమైన తిథి ... అమావాస్య పితృదేవతలకు సంబంధించిన తిథి. అందుకు ఈ పుణ్యతిథులలో సముద్రస్నానం చేయాలని శాస్త్రనియమం.
Images Credit: Pinterest