మధుమేహం ఉన్నవారికి ఏ జబ్బుల ప్రమాదం ఎక్కువ?

Published by: Geddam Vijaya Madhuri

మధుమేహం ఉన్నవారిలో గుండెపోటు, కరోనరీ ఆర్టరీ వ్యాధులు, స్ట్రోక్ వంటి హృదయ సంబంధిత సమస్యల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

దీర్ఘకాలంగా షుగర్ నియంత్రణలో లేకపోతే కిడ్నీలలోని సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతింటాయి. నెఫ్రోపతి అనే కిడ్నీ సమస్య వచ్చే ప్రమాదం ఉంటుంది.

మధుమేహం కంటి రెటీనా రక్తనాళాలపై ప్రభావం చూపుతుంది. డయాబెటిక్ రెటినోపతి, చూపు మందగించడం, అంధత్వం కూడా వచ్చే అవకాశం ఉంటుంది.

రక్తంలో చక్కెర ఎక్కువకాలం అధికంగా ఉంటే నరాలు దెబ్బతిని డయాబెటిక్ న్యూరోపతి రావచ్చు. దీనివల్ల కాళ్లలో తిమ్మిర్లు, మంట, మొద్దుబారే లక్షణాలు కనిపిస్తాయి.

మధుమేహం ఉన్నవారిలో హై బీపీ వచ్చే అవకాశం ఎక్కువ. ఈ రెండు సమస్యలు కలిసి గుండె, కిడ్నీలపై మరింత ఒత్తిడిని కలిగిస్తాయి.

రక్తనాళాల ఆరోగ్యం దెబ్బతినడం వల్ల మెదడుకు రక్త సరఫరాలో ఆటంకాలు ఏర్పడి స్ట్రోక్ ప్రమాదం పెరగవచ్చు.

నరాలు, రక్తప్రసరణ దెబ్బతినడం వల్ల పాదాలపై గాయాలు త్వరగా మానకపోవచ్చు. చిన్న గాయాలు కూడా తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు.

మధుమేహం రోగనిరోధక శక్తిపై ప్రభావం చూపవచ్చు. దీంతో చర్మం, మూత్రనాళాలు, చిగుళ్లు వంటి భాగాల్లో ఇన్ఫెక్షన్లు తరచూ వచ్చే అవకాశం ఉంటుంది.

టైప్-2 డయాబెటిస్ ఉన్నవారిలో నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.

మధుమేహం ఉన్నవారిలో చిగుళ్ల వాపు, ఇన్ఫెక్షన్లు, పళ్ల చుట్టూ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. అందుకే నోటి పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ అవసరం.

మధుమేహం ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ సమస్యలు వస్తాయని కాదు. కానీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడం, మందులు వాడటం మంచిది.