సాధారణంగా కార్తీకమాసం అనగానే నెలరోజుల పాటూ చన్నీటి స్నానాలు, దీపాలు, పూజలు.. ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక వాతావరణమే.
కొందరు సోమవారాలు, ఏకాదశి, పౌర్ణమి రోజుల్లో నియమాలు పాటిస్తే మరికొందరు కార్తీకమాసం మొత్తం తెల్లవారుజామునే చన్నీళ్లతో తలకు స్నానాలు చేస్తుంటారు.
కొందరైతే భక్తి పేరుతో అనారోగ్యాన్ని కూడా లెక్కచేయరు. కానీ తలకు స్నానం చేస్తేనే భక్తి అనుకుంటే పొరపాటే..కార్తీకమాసంలో నిత్యం తలస్నానం చేయడం వెనుకున్న ఆంతర్యం వేరే
సూర్యోదయానికి ముందు వణికించే చలిలో తలకు చన్నీటిస్నానం చేయమనడం వెనుకున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే.. అప్పటివరకూ బయటపడని అనారోగ్య సమస్యలేమైనా ఉంటే బయటపడతాయి .
సూర్యోదయానికి ముందు చన్నీటి స్నానం శరీరానికి పట్టిన బద్ధకాన్ని వదిలించడంతో పాటూ మానసిక ప్రశాంతతను ఇస్తుంది.
కార్తీకమాసం నియమాలు పాటించకపోతే పాపం చుట్టుకుంటుందని కొందరు, ఉపవాసం ఉండకపోతే భక్తి కాదని అంటారేమో అని మరికొందరు ఆలోచిస్తారు. ఆ ఆలోచన వెనుకున్నది కూడా భక్తే అయినప్పటికీ ఇలా చేస్తేమాత్రమే భక్తి అనుకోవద్దని సూచిస్తున్నారు పండితులు.
అప్పటికే చిన్నచిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు నిత్యం తలస్నానాలు చేయడం, చన్నీటి స్నానాలు చేయడం వల్ల అనారోగ్యం మరింత పెరుగుతుంది.
మీ ఆరోగ్యం సహకరించకపోయినా కానీ నిత్యం తలస్నానం చేయాల్సిన అవసరం లేదు.
మీకు అంతగా పట్టింపు ఉంటే కార్తీకమాసం మొదటి రోజు, కార్తీకసోమవారం, ఏకాదశి, కార్తీక పౌర్ణమి, పోలి స్వర్గం రోజు తలకు స్నానమాచరించి ఇంట్లో, తులసి మొక్క దగ్గర, ఆలయాల్లో దీపాలు వెలిగిస్తే సరిపోతుంది.
హిందూ ధర్మంలో పాటించే నియమాలన్నీ మన జీవనవిధానాన్ని సక్రమంగా మార్చుకునేందుకు, కొన్ని మంచి అలవాట్లు అలవర్చుకునేందుకు, పరిసరాల పరిశుభ్రతకోసమే అని తెలుసుకోవాలి...