ఆదాయపు పన్ను రిటర్న్ ఫైలింగ్ ప్రారంభమైంది. చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు ఇప్పటికే ఫామ్-16 జారీ చేశాయి. ఫారం-16 అనేది పర్సనల్ డాక్యుమెంట్. ప్రతి ఉద్యోగికి ఎవరి ఫామ్-16 వాళ్లకు అందుతుంది. ఉద్యోగికి ఇచ్చిన జీతం, ఉద్యోగి క్లెయిమ్ చేసిన తగ్గింపులు, కంపెనీ యాజమాన్యం తీసివేసిన TDS సమాచారం ఇందులో ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 203 ప్రకారం, కంపెనీలు తమ ఉద్యోగులకు ఫారం-16 ఇవ్వడం తప్పనిసరి. ఫామ్-16 వచ్చాక వీలైనంత త్వరగా ITR దాఖలు చేయాలి. 2023 జులై 31 వరకు గడువు ఉంది. ఆఖర్లో ఐటీ పోర్టల్‌లో రద్దీ పెరిగి ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి, తుది గడువు వచ్చే వరకు వేచి ఉండటం సరికాదు. మీ ఫామ్-16లో హౌస్ రెంట్ అలవెన్స్ (HRA), లీవ్ ట్రావెల్ అసిస్టాన్స్ (LTA) ముఖ్యమైనవి. మీ పాన్ నంబర్ సరిగా ఉందో, లేదో చెక్ చేసుకోండి. అందులో ఒక్క డిజిట్ తప్పుగా ఉన్నా TDS క్లెయిమ్ చేయలేరు. మీ పేరు, చిరునామా, కంపెనీ TAN చెక్ చేయండి. మినహాయింపు వివరాలన్నీ ఫామ్-26AS & AISతో సరిపోవాలి. మీరు 2022-23లో ఉద్యోగాలు మారినట్లయితే, పాత కంపెనీ నుంచి కూడా ఫామ్-16ని ఖచ్చితంగా తీసుకోండి.