టీ20 ప్రపంచకప్ 2022 విజేతగా ఇంగ్లాండ్ ఆవిర్భవించింది. రెండోసారి టీ20 ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడింది. మెల్‌బోర్న్ వేదికగా నువ్వా నేనా అన్నట్టు సాగిన ఫైనల్లో అద్వితీయ విజయం అందుకుంది. బంతితో కఠిన పోటీనిచ్చిన పాకిస్థాన్‌ను ఓడించింది. బంతి బంతికీ పెరిగిన ఒత్తిడిని చిత్తు చేసింది. ప్రత్యర్థి నిర్దేశించిన 138 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లిష్ జట్టు 5 వికెట్లు మిగిలుండగానే ఛేదించింది. 2019 వన్డే ప్రపంచకప్ మొనగాడు బెన్‌స్టోక్స్ (45; 43 బంతుల్లో 4x4, 1x6) అజేయంగా పోరాడి బిగ్ మ్యాచ్ ప్లేయర్ అని నిరూపించుకున్నాడు. పాక్‌లో బాబర్ ఆజామ్ (32; 28 బంతుల్లో 2x4), షాన్ మసూద్ (38; 28 బంతుల్లో 2x4, 1x6) టాప్ స్కోరర్లు. అద్భుతమైన సీమ్, బౌన్స్‌తో ఆంగ్లేయులను పాక్ బౌలర్లు ఇబ్బంది పెట్టారు. పవర్ ప్లే ముగిసే సరికే 3 వికెట్లు పడగొట్టారు. ఇన్నింగ్స్ ఆరో బంతికే అలెక్స్ హేల్స్ (1)ను షాహిన్ అఫ్రిది బౌల్డ్ చేశాడు. 32 వద్ద ఫిల్‌సాల్ట్ (10), 45 వద్ద బట్లర్‌ను హ్యారిస్ రౌఫ్ పెవిలియన్ పంపించాడు. మొయిన్ అలీ, హ్యారీ బ్రూక్ అండతో బెన్ స్టోక్స్ అజేయ హాఫ్ సెంచరీ చేశాడు. 16వ ఓవర్లో ఆఖరి 2 బంతుల్ని 4, 6గా మలిచాడు. తర్వాతి ఓవర్లో మొయిన్ మూడు బౌండరీలు కొట్టాడు. సమీకరణం 12 బంతుల్లో 7కు మారడంతో అలీ ఔటైనా ఇంగ్లాండ్ గెలిచేసింది.