ఇంగువను ఎలా తయారుచేస్తారో తెలుసా? ప్రసాదం పులిహోర చేసినా, సాంబారు చేసుకున్నా ,చిటికెడు ఇంగువ పొడి పడాల్సిందే. ఇంగువ మొక్కలు ఇంతవరకు మనదేశంలో పండలేదు. అయినా మన వంటల్లో భాగమైపోయింది. ఆఫ్గనిస్తాన్, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ వంటి దేశాల నుంచే మనకు అధికంగా ఇంగువ దిగుమతి అవుతుంది. అధిక ఉష్ణోగ్రతలు, అధిక వర్షపాతం, అధిక తేమ ఉన్న ప్రాంతాల్లో ఈ మొక్కలు పెరగవు. ఇంగువ మొక్కల వేళ్ల నుంచి జిగురులాంటి పదార్థాన్ని సేకరిస్తారు. ఆ పదార్థానికి బియ్యప్పిండి లేదా గోధుమపిండి కలిపి ఎండ బెడతారు. ముక్కలు ముక్కలుగా ఎండిన ఆ పదార్థాలను పొడిలా చేసి ఇంగువ పొడిగా అమ్ముతారు. మనదేశానికి ఇంగువ వచ్చి 600 ఏళ్లు గడిచిందని చరిత్రకారులు చెబుతారు. ఇంగువ మహత్యాన్ని, అది అందించే రుచి ఆరోగ్యాన్ని మన భారతీయులు అర్థం చేసుకున్నారు.