క్యాన్సర్లను తగ్గించే హిమాలయన్ వెల్లుల్లి వసంతకాలంలో పండే పంట హిమాలయన్ వెల్లుల్లి. దీన్నే కాశ్మీరీ వెల్లుల్లి అని, జమ్మూ వెల్లుల్లి అని పిలుస్తారు. చూడటానికి ఇవి పొట్టిగా, బంగారు రంగులో ఉంటాయి. మనం నిత్యం వాడే వెల్లుల్లికి కాస్త భిన్నమైన రూపంలో కనిపిస్తాయి. దీని రుచి మాత్రం చాలా ఘాటుగా ఉంటుంది. ఇది దొరికితే తినమని సిఫారసు చేస్తున్నారు పోషకాహార నిపుణులు. దీనిలో మాంగనీస్, విటమిన్ బి6, విటమిన్ సి, రాగి, సెలీనియం, ఫాస్ఫరస్ వంటివన్నీ పుష్కలంగా లభిస్తాయి. ఈ వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధికం. హిమాలయన్ వెల్లుల్లి తినడం వల్ల మన రక్తనాళాల్లో ఫలకాలు ఏర్పడడం, రక్తం గడ్డ కట్టడం వంటి సమస్యలు రావు. దీనిలో E.coli, ఆంత్రాక్స్ వంటి బ్యాక్టీరియాలను చంపే శక్తి ఉంది. ఎన్నో వైరస్, శిలీంధ్రాలకు వ్యతిరేకంగా ఇది పోరాడగలదు. వెల్లుల్లిలో ఉండే అల్లిసన్ సమ్మేళనం ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని ఇస్తుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు సహాయపడుతుంది.