చలికాలంలో కూడా పెరుగు తినడం అవసరమే చలికాలం పెరుగు తినకూడదని, అది దగ్గు, జలుబును తీవ్రం చేస్తుందని అంటారు. అయితే, అది అపోహ మాత్రమేనని ఆహార నిపుణులు అంటున్నారు. వాతావరణం చల్లగా ఉండేప్పుడు పెరుగును రాత్రి పూట కాకుండా, మధ్యాహ్నం తింటే మంచిది. పెరుగు తినడం కలిగే లాభాలను తెలుసుకుంటే మీరు దాన్ని అస్సలు మిస్ చేయరు. పెరుగులో విటమిన్స్‌తోపాటు పొటాషియం, మెగ్నీషియం, ప్రోటీన్ ఉంటాయి. పెరుగులోని లాక్టోబాసిల్లస్ (lactobacillus) చెడు బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉంచుతుంది. పెరుగులో ఉండే విటమిన్-సి.. జలుబు, దగ్గును నియంత్రిస్తుంది. పెరుగును ఫ్రిజ్‌లో పెట్టి తినకూడదు. కొనుగోలు చేసిన వెంటనే.. లేదా తోడుకున్న వెంటనే వాడేయాలి. ఫ్రిజ్‌లో పెట్టిన చల్లని పెరుగును తినడం వల్ల మేలు చేసే బ్యాక్టీరియా చనిపోయి.. పరిస్థితిని జఠిలం చేస్తుంది. పెరుగు జీర్ణ క్రియను మెరుగ్గా ఉంచుతుంది. అందుకే మన పూర్వికులు భోజనం తర్వాత తప్పకుండా పెరుగు తినాలని అంటారు. కడుపులో ఎసిడిటీ ఏర్పడకుండా pH (Potential of Hydrogen) బ్యాలెన్స్ చేస్తూ.. జీర్ణక్రియ సక్రమంగా సాగేలా చేస్తుంది. పెరుగులో తక్కువ కొవ్వు, క్యాలరీలు ఉంటాయి. కాబట్టి.. బరువు పెరుగుతామనే చింత కూడా అక్కర్లేదు. పెరుగు చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. చలికాలంలో పెరుగును తీసుకున్నా.. చర్మానికి రాసుకున్నా మంచిదే.