వినాయక చవితి 2022: తొలిపూజ వినాయకుడికే ఎందుకు చేయాలి!
విఘ్నాధిపతిగా వినాయకుడికిని పూజించడం వెనుక ఓ పురాణ గాధ ఉంది. ఒకసారి దేవతలు, ఋషులు శివుడిని కలిసి విఘ్నాలకు అధిపతిగా ఎవరినైనా నియమించమని అడుగుతారు. వినాయకుడు పొట్టిగా, లావుగా ఉన్నందున తనని విఘ్నాధిపతిగా నియమించమని అడుగుతాడు కుమార స్వామి.
ప్రపంచం లో ఉన్న పవిత్ర నదులలో స్నానమాచరించి ఎవరైతే ముందుగా తన దగ్గరికి వస్తారో వాళ్ళే విఘ్నాధిపతి అవుతారు అని చెప్తాడు. నెమలి వాహనంపై కుమారస్వామి పవిత్ర నదులలో స్నానమాచరించడానికి బయలుదేరతాడు.
తన అవతారం చూసి కొంచెం కలత చెందిన వినాయకుడు తల్లిదండ్రుల వద్దకు వెళ్లి తన సోదరుని వలే వేగంగా తాను కదలలేను కాబట్టి మీరే నాకు ఈ పరీక్ష నెగ్గేందుకు మార్గం తెలియచేయమని ప్రార్ధిస్తాడు.
నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేస్తే అన్ని పవిత్ర నదులలో స్నానమాచరించిన ఫలితం దక్కుతుందని శివుడు ఉపదేశిస్తాడు . శివుడి ఉపదేశాన్ని పాటించడం వల్ల కుమారస్వామి స్నానమాచరించడానికి వెళ్ళిన ప్రతి నది వద్ద గణపతి అప్పటికే స్నానం ముగించి తిరిగి వస్తున్నట్టు కనిపిస్తాడు.
కైలాసానికి తిరిగి వచ్చిన కుమారస్వామి తన అజ్ఞానాన్ని మన్నించి గణపతినే విఘ్నాధిపతిగా చెయ్యమని తల్లితండ్రులను ప్రార్ధిస్తాడు. ఆ విధంగా వినాయకుడు విఘ్న నాయకుడు అయ్యాడు.
భారతదేశంలోని అతి ముఖ్యమైన హిందువుల పర్వదినం వినాయక చవితి. శివపార్వతుల కుమారుడైన గణనాథుడి జన్మదినాన్ని పురస్కరించుకుని వినాయక చవితి జరుపుకుంటారు. ఈ పండుగ భాద్రపద మాసంలో నాలుగో రోజు..అంటే చవితి రోజు ప్రారంభమై..నవరాత్రులు వైభవంగా జరుగుతుంది.
వినాయకచవితి రోజు ప్రతిఇంట్లో బొజ్జగణపయ్య సందడి ఉంటే.. మండపాల్లో మాత్రం దాదాపు 11 రోజుల పాటూ లంబోదరుడు పూజలందుకుని.. ఆ తర్వాత ఊరేగింపుగా గంగమ్మ ఒడికి చేరుకుంటాడు.
భారత దేశం లో ని వివిధ ప్రాంతాల్లో ఈ పండుగని గణేష్ చతుర్ధి లేదా వినాయక చతుర్ధి అని కూడా పిలుస్తారు.
ఏ పని మొదలుపెట్టాలన్నా, అనుకున్న పని ఫలప్రదం కావాలన్నా ముందుగా విఘ్నాధిపతి అయిన వినాయకుడిని వేడుకుంటారు. విఘ్నాలు అంటే ఆటంకాలు...ఆటంకాలు లేకుండా తలపెట్టిన పని పూర్తయ్యేలా చేయమని గణపతిని వేడుకుంటారు.