పాలవెల్లి ఎందుకు కడతారు!



ఈ అనంత విశ్వంలో భూమి అణువంతే ! ఆ భూమి మీద నిలబడి పైకి చూస్తే సూర్యుడిని తలదన్నే నక్షత్రాలు కోటానుకోట్లు కనిపిస్తాయి. ఒక పాలసముద్రాన్నే తలపిస్తాయి. అందుకే వాటిని పాలపుంత లేదా పాలవెల్లి అని అంటాము. ఆ పాలవెల్లికి సంకేతంగా ఒక చతురస్రాన్ని కడతారు.



గణేశుని పూజ అంటే ప్రకృతి ఆరాధనే కదా ! ప్రకృతిలో సృష్టి , స్థితి , లయలనే మూడు స్థితులు కనిపిస్తాయి. గణేశుని పూజలో ఈ మూడు స్థితులకూ ప్రతీకలని గమనించవచ్చు.



ఈ భూమిని సూచించేందుకు మట్టి ప్రతిమను , జీవాన్ని సూచించేందుకు పత్రినీ , ఆకాశాన్ని సూచించేందుకు పాలవెల్లినీ ఉంచి ఆ ఆరాధనకి ఓ పరిపూర్ణతని ఇస్తారు



గణపతి అంటే గణాలకు అధిపతి , తొలిపూజలందుకునే దేవుడు. ఆ గణపతిని పూజించడం అంటే ముక్కోటి దేవతలనూ పూజించడమే కదా ! ఆ దేవతలందరికీ సూచనగా పాలవెల్లిని నిలబెడుతున్నాం అని అర్థం



పాలపుంతని సూచించే పాలవెల్లికి..నక్షత్రాలకు గుర్తుగా పళ్లు కడతారు. వెలగపండు, మొక్కజొన్నపొత్తులు , జామ , దానిమ్మలాంటి పండ్లు కడతారు.



ఏ దేవతకైనా షోడశోపచార పూజలో భాగంగా ఛత్రాన్ని సమర్పించడం ఆనవాయితీ. కానీ వినాయకుడంటే సాక్షాత్తు ఓంకార స్వరూపుడు కదా ! అందుకే స్వామికి ఛత్రంగా పాలవెల్లి ఉంటుంది.



గణపతి పూజ ఆడంబరంగా సాగే క్రతువు కాదు. మనకి అందుబాటులో ఉన్న వస్తువులతో భగవంతుని కొలుచుకునే సందర్భం. బియ్యంతో చేసిన ఉండ్రాళ్లు ,పత్రి లాంటి వస్తువులే ఇందులో ప్రధానం.



ఏదీ లేకపోతే మట్టి ప్రతిమను చేసి , పైన పాలవెల్లిన కట్టి గరికతో పూజిస్తే చాలు...గణనాథుడు దిగొచ్చినట్టే...!



వినాయక చవితి రోజున సాగే ప్రతి ఆచారమూ ఇతర పండుగలకి భిన్నంగానే సాగుతుంది.



(Images Credit: Pinterest)