శరన్నవరాత్రుల్లో బాలపూజ - ఎన్నేళ్ల పిల్లల్ని పూజిస్తే ఎలాంటి ఫలితం!



శరన్నవరాత్రుల్లో అమ్మవారి అలంకారాల్లో ఒకటి బాలాత్రిపుర సుందరీ దేవి. ఈ రోజు చిన్నారులను అమ్మవారి స్వరూపంగా భావించి పూజలందిస్తారు.



అమ్మవారు మూడు రూపాల్లో కనిపిస్తుంది
1.కుమారిగా బాలత్రిపుర సుందరి
2.యవ్వనవతిగా లలితాత్రిపుర సుందరి
3.వృధ్ధరూపం త్రిపురభైరవి



బాల త్రిపుర సుందరీ దేవిది త్రిగుణైక శక్తి - సరస్వతి విఙ్ఞానం, కాళిక శక్తి, లలిత సౌభాగ్యం కలుపుకున్న బాల ఆనందప్రదాయిని. నిర్మలత్వానికి ప్రతీక అయిన బాల్యంలో మనసు,బుద్ధి, అహంకారం ఈ తల్లి అధీనంలో ఉంటాయి.



అభయహస్తం, అక్షమాల ధరించిన బాలరూపాన్ని ఆరాధిస్తే నిత్యసంతోషం కలుగుతుందని విశ్వాసం. షోడస విద్యకు ఈమే అధిష్ఠన దేవత కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరి దేవి అనుగ్రహం కోసం బాలర్చన చేస్తారు.



రెండుసంవత్సరాలు ఉన్న బాలికను కుమారి అంటారు. కుమారిగా భావించి పూజించడం వల్ల దారిద్ర్యదుఃఖాలు నశిస్తాయి.



మూడుసంవత్సరాలు ఉన్నబాలికను త్రిమూర్తి అని అంటారు. ఈ త్రిమూర్తిని పూజించడం వల్ల ధనధాన్య, పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుంది.



నాలుగుసంవత్సరాలు ఉన్న బాలికను కల్యాణి అని అంటారు. కల్యాణిని పూజించడం వల్ల రాజ్యాభివృద్ధి, విద్యాభివృద్ధి చేకూరుతుంది.



ఐదుసంవత్సరాలు ఉన్న బాలికను రోహిణి అని అంటారు. రోహిణిని పూజించడం వల్ల ఆరోగ్యం చేకూరుతుంది.



ఆరుసంవత్సరాలు ఉన్న బాలికను కాళిక అని అంటారు, కాళికను పూజించడం వల్ల శత్రునాశనం జరుగుతుంది



ఏడు సంవత్సరాల బాలికను చండిక అంటారు. ఈ అమ్మను పూజిస్తే పేదరికం తొలగి ఐశ్వర్యం కలుగుతుంది



ఎనిమిది సంవత్సరాల బాలికను శాంభవి అంటారు. ఈ అమ్మను పూజిస్తే ప్రతి పనిలో ఆటంకాలు తొలగి, అనుకూలత ఏర్పడుతుంది.



తొమ్మిదేళ్ల పాపను దుర్గ అని అంటారు. ఈ అమ్మను పూజించడం వల్ల అన్ని రకాల సుఖ సంతోషాలు చేకూరుతాయి.