పాపులర్ సింగర్ సుమన్ కల్యాణ్‌పూర్ మృతి... 89 ఏళ్ళ వయసులో తిరిగిరాని లోకాలకు
Published by: Satya Pulagam
ప్రముఖ గాయని సుమన్ కళ్యాణ్ పూర్ ఆదివారం (మే 31, 2026) సాయంత్రం కన్ను మూశారు. ఆమె 89 సంవత్సరాల వయస్సులో తుదిశ్వాస విడిచారు.
బాలీవుడ్ నుంచి రాజకీయ ప్రముఖుల వరకు సింగర్ సుమన్ కళ్యాణ్‌పూర్ మరణంపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సంగీత ప్రపంచం విషాదంలో మునిగింది.
వృద్ధాప్యానికి సంబంధించిన సమస్యల కారణంగా ఆదివారం సాయంత్రం స్వగృహంలో సుమన్ కళ్యాణ్ పూర్ మరణించారని ఆమె సన్నహితులు తెలిపారు.
అవిభక్త భారతదేశం... ఇప్పటి బంగ్లాదేశ్‌లోని భవానిపూర్‌లో జనవరి 28, 1937న సుమన్ కళ్యాణ్‌పూర్ జన్మించారు.
సుమన్ కళ్యాణ్ పూర్ 800 కంటే ఎక్కువ సినిమాల్లో పాటలు పాడారు. ఆమె హిందీలోనే కాకుండా పంజాబీ, మరాఠీ, అస్సామీ, గుజరాతీ, కన్నడ, భోజ్పురి తదితర భాషల్లో పాటలకు తన గాత్రం అందించారు.
బెంగాలీతో సహా అనేక భాషల్లో పాటలు పాడారు. 'నా నా కర్తే ప్యార్ తుమ్హీం సే' (జబ్ జబ్ ఫూల్ ఖిలే) సాంగ్ ఆమె పాటల్లో ఎవర్‌గ్రీన్ టాప్ ప్లేస్.
ఇటీవల తేరే మేరే ప్యార్ కే చర్చె (బ్రహ్మచారి), బెహనా నే భాయీ కీ కలాయీ (రేష్మ్ కీ డోరీ) వంటి సూపర్ హిట్ పాటలను సుమన్ పాడారు.
సంగీతంలో అసాధారణ ప్రతిభ చూపించి... కళామతల్లికి సేవ చేసిన సుమన్ కళ్యాణ్‌పూర్‌ను 'పద్మ భూషణ్'తో సత్కరించింది భారత ప్రభుత్వం.
సుమన్ కళ్యాణ్ పూర్ మృతి భారతీయ చిత్రసీమకు తీరని లోటు అని పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.