తల్లిదండ్రులే గురువులుగా మారి వారికి ఆర్థిక పాఠాలు బోధించాలని నిపుణులు అంటున్నారు. కనీసం ఈ ఆరు ఆర్థిక పాఠాలను వారికి నేర్పించాలని చెబుతున్నారు



డబ్బులు ఊరికే రావన్న సత్యాన్ని పిల్లలకు బాల్యంలోనే నేర్పించాలి. ఎంతో కష్టపడితేనే ధనం ముడుతుందని చెప్పాలి. డబ్బు, కష్టం విలువను వారికి బోధించాలి. అందుకే అడిగిందల్లా వారికి ఇవ్వకూడదు. మీ పిల్లల వయసు 8-10 ఏళ్లు ఉంటే ఇలా చేయండి.



ఇంట్లో పనుల్లో మీకు సాయపడితే డబ్బులు ఇస్తామని చెప్పండి. వారు చక్కగా బాధ్యతలు నిర్వర్తిస్తే మీరు ఎంతవ్వాలని అనుకున్నారో అంత ఇవ్వండి. బాధ్యతల్లో నిర్లక్ష్యం వహిస్తే నిర్దాక్షిణ్యంగా ఇవ్వాల్సిన దాంట్లో కోత పెట్టండి. అప్పుడు కష్టపడితేనే డబ్బులొస్తాయని అర్థమవుతుంది.



చిన్నారులకు డబ్బును సరిగ్గా ఖర్చుపెట్టడం బోధించాలి. ఎందుకంటే ఈ కాలంలో డబ్బును వృథాగా ఖర్చుచేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. 'ఏది ఇష్టమో కాకుండా ఏది అవసరమో' నేర్పించాలి. ధరను బట్టి కాకుండా విలువను బట్టి కొనుగోళ్లు చేపట్టాలని నేర్పించండి.



ఉదాహరణకు షాపులోకి తీసుకెళ్లగానే రంగురంగుల పెన్సిళ్ల డబ్బా నచ్చిందనుకోండి. వెంటనే కొనివ్వద్దు. అదే పని అంతకన్నా తక్కువ ధరలో వస్తున్న మంచి పెన్సిళ్లు చేస్తే వాటినే కొనివ్వండి.



'ఒక రూపాయి దాచుకోవడం ఒక రూపాయి సంపాదించుకోవడమే' అని ఎప్పట్నుంచో ఉన్నదే! కానీ ఎప్పటికీ అదే నిజమైనది. అందుకే పిల్లలకు డబ్బును ఆదా చేసుకోవడం నేర్పించాలి. ఒక పిగ్గీ బ్యాంకును ఏర్పాటు చేసి సేవింగ్స్‌ అలవాటు చేయించాలి. వారు పెరిగి పెద్దయ్యాకా ఇది ఉపయోగపడుతుంది.



వారెన్‌ బఫెట్‌ పదకొండేళ్ల వయసులోనే స్టాక్‌మార్కెట్లో ట్రేడింగ్‌ చేయడం మొదలు పెట్టారు. ఆర్థిక ఎదుగుదల, సంపద సృష్టికి ఇన్వెస్ట్‌మెంట్స్‌ అనేవి తప్పనిసరి. అందుకే వారికి స్టాక్‌ మార్కెట్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, బాండ్ల గురించి వారి స్థాయికి తగినట్టుగా వివరిస్తుండాలి. వాటిని పరిచయం చేస్తుండాలి.



ఎంత ఇన్వెస్ట్‌ చేస్తే కొన్ని రోజుల తర్వాత ఎంతొస్తుంది వంటి విషయాలు చర్చిస్తుండాలి. వారి చేతే ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వంటివి చేయిస్తుంటే పాసివ్‌ ఇన్‌కమ్‌ గురించి అర్థమవుతుంది.



కాలం గడిచే కొద్దీ డబ్బు విలువ తగ్గుతుందని పిల్లలకు నేర్పించాలి. ఇప్పటి రూపాయి విలువ మరో ఐదేళ్లకు తగ్గిపోతుందని వారికి చెప్పాలి. ద్రవ్యోల్బణం వంటివి వివరించాలి. ఉదాహరణకు పదేళ్ల క్రితం ఒక పెన్సిల్‌ లేదా ఏవైనా నోట్‌బుక్‌లు ఎంత ధర ఉండేవి ఇప్పుడెంత పెరిగాయో చెప్పాలి.



సంపాదించిన మొత్తంలో తోచిన మేరకు దానం చేయడం నేర్పించాలి. దానివల్ల కలిగే సంతృప్తి వారికి వివరించాలి. బాల్యం నుంచే దాతృత్వం గురించి నేర్పితే పెద్దయ్యాక వారు మంచి మనుషులుగా మారతారు. మంచి వ్యక్తిత్వం అలవాటు అవుతుంది. సమాజానికి ఎంతో కొంత తిరిగివ్వాలనే స్పృహ ఏర్పడుతుంది.