చాణక్య నీతి: మిమ్మల్ని అవమానించేవారికి మీరిచ్చే సమాధానం ఇలా ఉండాలి!



ప్రాచీన భారతదేశంలో 'మగధ' చాలా గొప్ప సామ్రాజ్యం. ప్రాచీన భారతదేశ సంస్కృతి, వైభవానికి ఈ రాజ్యం గొప్పకేంద్రం. ఇలాంటి రాజ్యంలో ప్రసిద్ధుడైన గొప్ప పండితుడు చణకుడు. ఈయన కుమారుడే చాణక్యుడు.



చణకుడి కుమారుడు కావడం వల్లే చాణక్యుడు అయ్యాడు. అయితే చిత్రం ఏంటంటే చాణక్యుడు దంతాలన్నింటితో జన్మించాడు. సాధారణంగా దంతాలతో జన్మించిన వారు కింగ్ అవుతారని అంటారు.



కుల ధర్మానికి వ్యతిరేకంగా కుమారుడు చక్రవర్తి కావడం తండ్రికి ఇష్టం లేదు. ఎందుకంటే తమని బ్రాహ్మణ వంశం. ఈ వంశానికి చెందిన వాడు బ్రాహ్మణధర్మం నిర్వర్తించాలి కానీ క్షత్రియ ధర్మం నిర్వహించకూడదు.



చణకుడు ఓ రాయి తీసుకుని కుమారుడి పళ్లు విరగ్గొట్టేందుకు ప్రయత్నించాడు. కొన్ని పగిలాయి, మరికొన్ని సగం సగం విరిగి అలాగే ఉండిపోయాయి. దీంతో చాణక్యుడి ముఖం వికారంగా తయారైంది.



అసలే నలుపు, ఆపై విరిగి పళ్లు చూసేందుకే భయపడేవారంతా. అందగాడు కాకపోతేనేం అద్భుతమైన తెలివితేటలున్నవాడు చాణక్యుడు.



బాల్యంలోనే నాలుగు వేదాల్లో అపారమైన పాండిత్యాన్ని సంపాదించాడు.కొడుకు తెలివితేటలు చూసి తండ్రి తక్షశిల విశ్వవిద్యాలయంలో చేర్పించాడు.



చాణక్యుడు తరగతి గదిలోకి రాగానే వికృత రూపాన్ని చూసి విద్యార్థులంతా గేలి చేశారు. కానీ కొన్నాళ్లు గడిచేసరికి అపూర్వ ప్రజ్ఞ, ధారణాశక్తి ఏ స్థాయిలో ఉందో వారికి అర్థమైంది.



అప్పటి వరకూ రూపం చూసి భయపడిన వారంతా గౌరవంతో దగ్గరకు చేరడం ప్రారంభించారు. కొన్నాళ్లు విద్యాభ్యాసం అనంతరం అక్కడే ఆచార్యుడిగా విధులు నిర్వర్తించాడు చాణక్యుడు.



చిన్నప్పటి నుంచీ తన మనసులో కురూపి అనే ఫీలింగ్ మనసులో అలాగే ఉండిపోయింది. అయితే దంతాలతో జన్మించిన వ్యక్తి కింగ్ అవుతాడని తండ్రి భయపడినట్టే.. కింగ్ అవకపోయినా కింగ్ మేకర్ మాత్రం అయ్యాడు చాణక్యుడు.



మీ రూపాన్ని అవమానించిన వారే మీ ముందు తలొంచుకుని నిలబడాలంటే మీలో మేథస్సే సరైన సమాధానం అని ప్రూవ్ చేసి చూపించాడు చాణక్యుడు