ఆషాడమాసంలోనే బోనం ఎందుకు సమర్పిస్తారు!

తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ. ఆషాఢ మాసం ఆరంభం నుంచి  ఊరూరా మొదలయ్యే సందడి  నెల రోజుల పాటూ సాగుతుంది.

గ్రామ దేవతలైన పోశమ్మ, మైసమ్మ, బాలమ్మ, ఎల్లమ్మ, ముత్యాలమ్మ, మహంకాళమ్మ, పెద్దమ్మ, వీరికి తోడుగా గ్రామాన్ని కాపాడే పోతురాజు అనుగ్రహంకోసం  బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేస్తారు.

బోనాల జాతరను కాకతీయుల కాలంనుంచే  నిర్వహిస్తున్నట్లు చరిత్రకారులు పేర్కొన్నారు. వర్షాకాలం ప్రారంభం కాగానే పారిశుద్ధ్య లోపంతో కలరా, ప్లేగు లాంటి అంటురోగాలతో అల్లాడేవారు. ఈ రోగాల బారి నుంచి కాపాడాలని శక్తిస్వరూపిణి అయిన అమ్మవారిని కొలిచేవారు.

బోనం అంటే ఆహారం, భోజనం అని అర్థం. అమ్మవారికి నైవేద్యం వండి కుండను పసుపు, కుంకుమ, సున్నం, పువ్వులు, వేపకొమ్మలతో అలంకరించి దానిపై దీపం వెలిగిస్తారు.

ఆ కుండను తలపై పెట్టుకుని డప్పు చప్పుళ్ల మధ్య ప్రదర్శనగా వెళ్లి అమ్మకు సమర్పిస్తారు. విస్తారంగా వర్షాలు కురిపించాలని, అంతా ఆరోగ్యంగా ఉండాలని వేడుకుంటారు. 

కొందరు అమ్మవారికి బోనంతో పాటు సాక సమర్పిస్తారు. చిన్న మట్టిపాత్రలో నీళ్లుపోసి చక్కెర, బెల్లం కలిపి పానకాన్ని తయారు చేస్తారు. ఆ తీర్థంలో వేపకొమ్మలు ఉంచి ,బోనంపై పెట్టుకుని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు.

పోతురాజులు, శివసత్తుల విన్యాసాలు బోనాలకు ప్రత్యేక ఆకర్షణ. గ్రామ దేవతలైన ఓరుగంటి రేణుక ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, బాలమ్మ, ముత్యాలమ్మ, మహంకాళమ్మ, పెద్దమ్మ ఏడుగురు అక్కచెల్లెల్లకు ఒక్కగానొక్క తమ్ముడు పోతురాజు.

ఏడుగురు అక్కచెల్లెళ్లకు ఒక్కో పండుగ ఏర్పాటు చేసిన ఎల్లమ్మ తమ్ముడి కోసం ఏమీ చేయలేదని బాధపడగా.. మీరు వెలిసిన గ్రామాల్లో దుష్టశక్తులు చొరబడకుండా పొలిమేరల్లో కాపలా ఉంటానని చెప్పాడట

ఆషాడమాసంలో అమావాస్య తర్వాత వచ్చే గురువారం లేదా ఆదివారం బోనాలు నిర్వహిస్తారు. ఈ ఏడాది జూన్ 30న  మధ్యాహ్నం 12గంటలకు గోల్కొండ బోనాలు ప్రారంభం అవుతాయి.

జులై 17న ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు, జులై 18న రంగం, భవిష్యవాణి జరగనున్నాయి. జులై 24న భాగ్యనగర బోనాలు, జులై 25న ఉమ్మడి దేవాలయాల ఘటాల ఊరేగింపు ఉంటుంది. జులై 28వ తేదీన గోల్కొండ బోనాలతో ఉత్సవాలు ముగియనున్నాయి.