రుషికొండపై గత ప్రభుత్వం నిర్మించిన భవనాల తర్వాత ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ సీపీ నిర్మిస్తున్న భవనాలపైకి ఫోకస్ మళ్లింది. ఓ ప్రధాన పత్రికలో వచ్చిన కథనం ఆధారంగా మంత్రి నారా లోకేశ్ కూడా ఈ వ్యవహారంపై ప్రశ్నించారు. ఇప్పటికే వైఎస్ జగన్‌కు బెంగళూరు, హైదరాబాద్, ఇడుపులపాయ, తాడేపల్లిలో ఉన్న ఇళ్లను ప్యాలెస్‌లని విమర్శిస్తుంటారు. విశాఖపట్నంలోని రుషికొండపై భవనాలతో వైఎస్ జగన్ ఈ విమర్శలను మరింతగా ఎదుర్కొంటున్నారు. తాజాగా అన్ని జిల్లాల్లోనూ వారు నిర్మించుకుంటున్న పార్టీ కార్యాలయాలపైకి అందరి దృష్టి మళ్లింది. వైసీపీ ఆఫీస్‌ల కోసం 26 జిల్లాల్లో 42.24 ఎకరాల ప్రభుత్వ భూములు వాడుకుంటున్నారని నారా లోకేశ్ ఆరోపిచారు. వాటన్నిటిని అనుమతులు లేకుండా కేటాయించుకున్నారని, వాటి మొత్తం విలువ ₹688 కోట్లు అని అన్నారు. ఆ 42 ఎకరాల్లో 4,200 మంది పేదలకు సెంటు స్థలాలు ఇవ్వొచ్చని నారా లోకేశ్ అన్నారు. విలాసాల ప్యాలెస్‌ల నిర్మాణానికి అయ్యే 500 కోట్లతో 25 వేల మంది పేదలకు ఇళ్లు కట్టి ఇవ్వవచ్చన అన్నారు. ఏంటి ఈ ప్యాలెస్‌ల పిచ్చి? నీ ధనదాహానికి అంతులేదా? అని లోకేశ్ జగన్‌ను విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఒకటి నుంచి రెండెకరాలు విస్తీర్ణంలో వైసీపీ పార్టీ ఆఫీసులు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి. వాటి నిర్మాణ శైలి ప్యాలెస్‌ల తరహాలో ఉండడంతో వైఎస్ జగన్ తీరును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ భూములు అన్నింటిని వక్రమార్గాల్లో పొందారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.