కొంత మంది తమకు పని దొరకడం లేదంటారు. మరికొంత మంది తమ స్థాయికి తగిన ఉద్యోగం లేదంటారు. పలు కారణాలు చెప్తూ చాలా మంది ఖాళీగా కూర్చుంటారు. కానీ, కొందరు ఇంకోలా ఉంటారు. దొరికిన పనిని ఎంతో ఇష్టంతో చేస్తారు. ఏ పని చేస్తున్నాం అని కాదు.. చేసే పని ఎంత బాగా చేస్తున్నాం అనేదే ముఖ్యం అంటారు. ఇందుకు నిదర్శనం ఈ మహిళా జొమాటో ఫుడ్ డెలివరీ ఏజెంట్. పని మీద తనకు ఎంత రెస్పెక్ట్ అంటే.. చంటి పాపను.. వీపుకు కట్టుకుని మరీ వెళ్లి ఫుడ్ డెలివరీ చేస్తోంది. ఆమెకు చిన్న బాబు కూడా సహకారం అందిస్తున్నాడు.
అసలే పేద కుటుంబం. పైగా ఇంటి భారం తనే మోస్తోంది. ఎలాగోలా జొమాటోలో ఫుడ్ డెలివరీ చేసే పనికి కుదిరింది. పిల్లలను చూసుకుంటూనే పని చేసుకుంటుంది. తాజాగా ఈ మహిళ ఫుడ్ డెలివరీ చేస్తుండగా.. ఫుడ్ బ్లాగర్ సౌరభ్ పంజ్వానీ చూశాడు. వెంటనే వీడియో తీశాడు. తను ఆర్డర్ చేసిన ఫుడ్ తీసుకొని వచ్చిన మహిళను చూసి ఆశ్చర్యపోయాడు. చేతిలో ఫుడ్ పార్సిల్, నడుముకు చిన్నారి.. వెంటనే మరో చిన్న బాబును చూసి అవాక్కయ్యాడు. వెంటనే తనతో మాటలు కలిపాడు. ఆమెకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నాడు. ఆమె కూడా తన పనికి సంబంధించిన వివరాలను చెప్పింది. ఇంటి దగ్గర ఎవరూ ఉండరని.. అందుకే తను పసి బిడ్డను వెంట తీసుకునే ఫుడ్ డెలివరీ చేసేందుకు వెళ్తున్నట్లు చెప్పింది. పసిపాపనే కాదు.. తన బాబు కూడా వెంటే వస్తాడని చెప్పింది. అతడు కూడా ఫుడ్ డెలివరీలో సాయం చేస్తాడని చెప్పింది.
ఈ వీడియోను సౌరభ్ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టు చేశాడు. ఆమెను చూసి తాను ఎంతో స్ఫూర్తి పొందినట్లు వెల్లడించాడు. జొమాటో డెలివరీ మహిళ తన ఇద్దరు పిల్లలతో రోజంతా ఎండలో కష్టపడి పని చేస్తుందని చెప్పాడు. పని చేయాలనే తపన ఉంటే ఎవరు ఏ పనైనా చేయగలరు అనడానికి ఈమె జీవితమే నిర్శనం అని చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ఎంతో మంది మహిళపై ప్రశంసలు కురిపించారు. ఇద్దరు పిల్లల కోసం తల్లిపడుతున్న కష్టాన్నిఎంతో కొనియాడారు. పనిలేదని సోమరిపోతుల్లా తిరిగే వారికి ఈ జొమాటో మహిళ ఆదర్శం అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో మిలియన్ వ్యూస్‌తో ట్రెండ్ అవుతుంది. ఈ వీడియోపై ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో కూడా స్పందించింది. సదరు మహిళ పిల్లల బాగోగులు చూసుకునేందుకు ముందుకు వచ్చింది. ఆ పిల్లలకు మంచి జీవితాన్ని అందించేందుకు సహాయం చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే సదరు మహిళను సంప్రదించి వివరాలు అడిగి తెలుసుకున్నది. త్వరలోనే పిల్లల చదువు సహా పలు అవసరాలకు సహకారం అందించనున్నట్లు తెలిపింది.
Also Read: ఈ హోటల్ కేవలం పందులకే - ఫుల్ సెక్యూరిటీ, వైద్యుల పర్యవేక్షణతో లగ్జరీ లైఫ్!