Mexico Train Accident: సెల్ఫీ.. ఆనందానికే కాదు, విషదాలకు కూడా కారణం అవుతుంది. అయినా యువత మాత్రం ఈ విషయంలో జాగ్రత్తపడడం లేదు. రోజురోజుకీ జనాలకు సెల్ఫీలపై పెరుగుతున్న క్రేజ్ వల్ల ప్రాణాలు పోతూనే ఉన్నాయి. తాజాగా మెక్సికోలో అలాంటి మరో ఘోర ప్రమాదం జరిగింది. కదులుతున్న ట్రైన్‌తో సెల్ఫీ తీసుకుందామని రైలుపట్టాల దగ్గరకు వెళ్లి నిలబడింది ఒక యువతి. దీంతో వేగంగా వస్తున్న ఆ రైలు.. నేరుగా ఆమె తలను ఢీ కొట్టింది. అంతే.. ఆమె అక్కడికక్కడే తల పగిలి చనిపోయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


చాలా బిజీ..


తరచుగా కెనడా నుంచి మెక్సికో సిటీకి ఒక స్పెషల్ ట్రైన్ ప్రయాణిస్తూ ఉంటుంది. పురాతన స్టీమ్ ఇంజిన్‌తో నడిచే ఈ రైలుతో సెల్పీలు దిగడానికి జనాలు ఎగబడతారు. తాజాగా మెక్సికోలోని హిడాల్గో ప్రాంతంలో ఆ ట్రైన్‌తో సెల్ఫీ తీసుకోవడానికి చాలామంది రైలుపట్టాల దగ్గరకు చేరుకున్నారు. వారిలో ఒక యువతి రైలు ఇంజిన్‌తో దగ్గర నుంచి సెల్ఫీ తీసుకోవడం కోసం పట్టలకు సమీపంలో నిలుచుంది. సెల్పీ కోసం ఫోన్ చూస్తూ మరింత ముందు వెళ్లింది. దీంతో వేగంగా దూసుకొచ్చిన రైలు.. ఆమె తలను బలంగా ఢీ కొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే స్పృహ కోల్పోయింది. ఇది గమనించిన ఒక వ్యక్తి.. ఆమెను ట్రైన్ నుంచి దూరంగా లాక్కొచ్చాడు. అయితే, ఆమెలో ఎలాంటి చలనం కనిపించలేదు.






మరెన్నో ఘటనలు..


సెల్ఫీ క్రేజ్‌లో పడి ఇలాంటి ట్రైన్ యాక్సిడెంట్లు ఎన్నో జరుగుతున్నా కూడా యువత అస్సలు అలర్ట్ అవ్వడం లేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా ఇలాంటి మరెన్నో ఘటనల వీడియోలను కూడా షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా మెక్సికోలో జరిగిన ఈ ఘటనలో ఆ యువతి అలా పడిపోయినా కూడా ఒకరు కూడా సాయం చేయడానికి ముందుకు రాలేదు. ఒక్క వ్యక్తి మాత్రమే తనను పక్కకు లాగడానికి కష్టపడుతున్నా కూడా తనను కనీసం ఎవరూ పట్టించుకోలేదు. ఫోన్స్‌కు, సెల్ఫీలకు, సోషల్ మీడియాకు అడిక్ట్ అవ్వడం వల్ల ఎలాంటి దారుణాలు జరుగుతున్నాయని చెప్పడానికి ఈ వీడియో కూడా ఉదాహరణ అంటూ కొందరు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


అక్కడికక్కడే మృతి..


రైలు.. ఆ యువతి తలను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిందని కెనడాకు చెందిన పసిఫిక్ కానాస్ సిటీ కంపెనీ ప్రకటించింది. అంతే కాకుండా ఈ ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. రైల్వే ట్రాక్స్ వద్ద ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని, సెల్ఫీల కోసం ఎలాంటి రిస్క్ తీసుకోవద్దని సూచించింది. ఇలాంటి ఘటనలు ఎన్ని జరిగినా.. ఎంతమంది ప్రాణాలు కోల్పోయినా.. కొందరు మాత్రం ఇంకా ఇలాగే ప్రవర్తిస్తున్నారని చాలామంది అనుకుంటున్నారు.


Also Read: బర్డ్‌ఫ్లూ సోకిన వ్యక్తి మృతి, ప్రపంచంలోనే తొలి కేసు - WHO ఆందోళన