First Human Bird Flu Death: ప్రపంచంలోనే తొలి బర్డ్‌ఫ్లూ మరణం నమోదైంది. మెక్సికోలో ఓ వ్యక్తి ఈ ఫ్లూతో చనిపోయినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. ఏప్రిల్‌లోనే ఈ మరణం నమోదైందని, ఆ వ్యక్తికి వైరస్ ఎలా సోకిందనేది ఇంకా తెలియలేదని స్పష్టం చేసింది. బర్డ్‌ ఫ్లూతో ప్రాణనష్టం వాటిల్లేంత ప్రమాదం ఏమీ ఉండదని ఇప్పటికే WHO ప్రకటించింది. కానీ..ఇంతలోనే ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. మెక్సికోలో 59 ఏళ్ల వ్యక్తి అనారోగ్యంతో హాస్పిటల్‌లో చేరాడు. ఏప్రిల్ 24న ప్రాణాలు కోల్పోయాడు. తీవ్ర జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడం, డయేరియా లాంటి లక్షణాలు కనిపించినట్టు వైద్యులు వెల్లడించారు. మెక్సికోలోని ఓ పౌల్ట్రీలో A(H5N2) వైరస్‌లను గుర్తించినట్టు WHO వెల్లడించింది. అయితే...ఈ వైరస్ వ్యాప్తి ఎక్కడి నుంచి మొదలైందో వెతికే పనిలో పడింది. బర్డ్‌ ఫ్లూ ఓ మనిషికి సోకడం, ఆ వ్యక్తి చనిపోవడం ప్రపంచంలో ఇదే తొలిసారి. అమెరికాలో H5N1 bird flu కి ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదని కొందరు సైంటిస్ట్‌లు చెబుతున్నారు. అక్కడి డెయిరీ ఫామ్‌లలో పని చేసే ముగ్గురుకి ఈ ఫ్లూ సోకింది. కానీ ఆ వైరస్‌కి దీనికి సంబంధం లేదని మెక్సికో సైంటిస్ట్‌లు స్పష్టం చేస్తున్నారు. 


ఇప్పుడు మెక్సికోలో చనిపోయిన వ్యక్తి మెడికల్ హిస్టరీని వైద్యులు పరిశీలించారు. బాధితుడు అంతకు ముందు పౌల్ట్రీకి వెళ్లడం కానీ జంతువులతో కలిసి ఉండడం కానీ జరగలేదని వెల్లడించారు. అయినా మూడు వారాల పాటు బెడ్‌కే పరిమితమయ్యే స్థాయిలో అనారోగ్యానికి గురయ్యాడని తెలిపారు. బాధితుడికి టైప్ 2 డయాబెటిస్‌తో పాటు కిడ్నీ సంబంధిత వ్యాధులున్నట్టు వివరించారు. ఇలాంటి వ్యక్తికి ఫ్లూ సోకితే వెంటనే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఓ మనిషి నుంచి మరో మనిషికి ఈ ఫ్లూ సోకుతుందనడానికి ఇప్పటి వరకూ ఎలాంటి ఆధారాలు లేవని మెక్సికో ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. అటు అమెరికాలో ఇప్పటి వరకూ మూడు బర్డ్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. వీళ్లలో ఇద్దరిలో ఈ వ్యాధి లక్షణాలు కనిపించాయి. మూడో వ్యక్తిలో శ్వాస సంబంధిత సమస్యలు ఎదురయ్యాయి.