Wife Remarring Her Husband In Mahabubabad: తన భర్త వేరే మహిళను కన్నెత్తి చూసినా ఏ స్త్రీ తట్టుకోలేదు. అలాంటిది ఓ మహిళ తన భర్తకు దగ్గరుండి మరో యువతితో పెళ్లి చేయించింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో (Mahabubabad District) జరిగింది. బంధువులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్‌కు చెందిన సురేష్, సరిత దంపతులకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే, సురేష్‌కు ఓ మేనమామ ఉన్నాడు. అతనికి ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురికి ఇప్పటికే వివాహం జరగ్గా.. చిన్న కూతురు సంధ్య ఓ మానసిక వికలాంగురాలు. ఆమెకు ఇంకా వివాహం కాలేదు. ఈ క్రమంలో తమ తర్వాత ఆమె పరిస్థితి ఏంటని తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. సంధ్య గురించి పూర్తిగా తెలిసి అర్థం చేసుకున్న వారే ఆమెను బాగా చూసుకుంటారని భావించారు. 


పెళ్లి ప్రతిపాదన


ఈ క్రమంలో సంధ్య తల్లిదండ్రులు.. సురేష్ దంపతుల ముందు రెండో పెళ్లి ప్రతిపాదన పెట్టారు. సరితకు కూడా సంధ్య గురించి పూర్తిగా తెలుసు. ఆమెను చెల్లెలిగానే చూస్తూ వస్తోంది. మానసిక వికలాంగురాలైన సంధ్య సురేష్‌ను ఇష్టపడిందని తెలుసుకున్న సరిత వీరి పెళ్లికి అంగీకరించింది. ఈ క్రమంలో బుధవారం ఉదయం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆలయంలో బంధు మిత్రుల సమక్షంలో సురేష్, సంధ్యల వివాహం దగ్గరుండి మరీ జరిపించినట్లు బంధు మిత్రులు తెలిపారు. సంధ్య మానసిక వికలాంగురాలని.. ఆమె తన భర్త మేనమామ కూతురని సరిత తెలిపారు. ఆమెను తన చెల్లెలిలా చూసుకునేందుకే తన భర్తకు ఇచ్చి వివాహం జరిపించానని చెప్పారు. ఈ వివాహం స్థానికంగా చర్చనీయాంశమైంది.


Also Read: FM Radio Stations: తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని ఎఫ్ఎం రేడియో కేంద్రాలు - ఏయే ప్రాంతాల్లో అంటే?