New FM Radio Stations In AP And Telangana: దేశవ్యాప్తంగా 234 కొత్త నగరాల్లో ప్రైవేట్ ఎప్ఎం రేడియో సౌకర్యం కల్పించేందుకు కేంద్ర మంత్రివర్గం తాజాగా ఆమోదం తెలిపింది. దీంతో మాతృభాషలో స్థానిక కంటెంట్ పెంచేందుకు, అలాగే కొత్త ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు అవకాశం కలుగుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే ప్రధాన నగరాల్లో ఎఫ్ఎం రేడియో సౌకర్యం ఉండగా.. తాజాగా మరిన్ని నగరాల్లో రేడియో స్టేషన్లు విస్తరించనున్నాయి. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోనూ కొత్త ఎఫ్ఎం స్టేషన్లు ప్రారంభం కానున్నాయి. ఏపీలో 22 పట్టణాలు, తెలంగాణలో 10 నగరాల్లో ఎఫ్ఎం స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి.


ఏపీలో ఎక్కడెక్కడంటే.?


ఏపీలో మొత్తం 22 నగరాల్లో 68 కొత్త ఎఫ్ఎం రేడియో స్టేషన్లు (FM Radio Stations) ఏర్పాటు కానున్నాయి. ఆదోని 3, అనంతపురం 3, భీమవరం 3, చిలకలూరిపేట 3, చీరాల 3, చిత్తూరు 3, కడప 3, ధర్మవరం 3, ఏలూరు 3, గుంతకల్ 3, హిందూపూర్ 3, కాకినాడ 4, కర్నూలు 4, మచిలీపట్నం 3, మదనపల్లె 3, నంద్యాల 3, నరసరావుపేట 3, ఒంగోలు 3, ప్రొద్దుటూరు 3, శ్రీకాకుళం 3, తాడిపత్రి 3, విజయనగరం 3 రేడియో స్టేషన్లు కొత్తగా ఏర్పాటు కానున్నాయి.


అటు, తెలంగాణలోనూ 31 ఎఫ్ఎం రేడియో స్టేషన్లు కొత్తగా అందుబాటులోకి రానున్నాయి. ఆదిలాబాద్ 3, కరీంనగర్ 3, ఖమ్మం 3, కొత్తగూడెం 3, మంచిర్యాల 3, నల్గొండ 3, మహబూబ్ నగర్ 3, నిజామాబాద్ 4, రామగుండం 3, సూర్యాపేటలో 3 ఎఫ్ఎం స్టేషన్లు కొత్తగా ఏర్పాటు కానున్నాయి.


మరిన్ని నిర్ణయాలు


మరోవైపు, ఉత్పత్తి రంగానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ మేరకు బుధవారం కేంద్ర కేబినెట్ నిర్ణయాలను ఆయన వెల్లడించారు. తయారీ రంగానికి ఊతమిచ్చేలా దేశంలోనే కొత్తగా 12 స్మార్ట్ పారిశ్రామిక నగరాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీని ద్వారా 10 లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందని చెప్పారు. రూ.28,602 కోట్ల పెట్టుబడితో 10 రాష్ట్రాల్లో 12 కొత్త పారిశ్రామిక కారిడార్లను ఏర్పాటు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ఏపీలోని ఓర్వకల్లు - కొప్పర్తి, తెలంగాణలోని జహీరాబాద్‌లో ఇవి ఏర్పాటు కానున్నట్లు పేర్కొన్నారు. 


కడప జిల్లా కొప్పర్తిలో పారిశ్రామిక హబ్‌ కింద 2,596 ఎకరాలను అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ఇందు కోసం రూ.2,137 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఈ హబ్‌తో 54 వేల మందికి ఉపాధి కల్పిస్తామన్నారు. అలాగే, కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 2,621 ఎకరాల్లో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేస్తామని.. ఇందుకోసం రూ.2,786 కోట్లు వెచ్చించనున్నట్లు వివరించారు. దాదాపు 45 వేల మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయని.. వీటితో రాయలసీమకు లబ్ధి చేకూరుతుందని అన్నారు.


పోలవరానికి నిధులు


అటు, పోలవరం ప్రాజెక్టు పూర్తికి పెండింగ్ నిధులతో పాటు రూ.12,500 కోట్ల విడుదలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ సీఎం చంద్రబాబు పలుమార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులతో జరిపిన చర్చల ఫలితంగా నిధుల విడుదలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిధులు వస్తే ఆర్థికంగా వెసులుబాటు ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో ప్రాజెక్టు పనులు మరింత ఊపందుకోనున్నాయి.


Also Read: Telangana: సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ - డిసెంబర్‌ 9 నాటికి పూర్తి చేసేలా పనులు