No Fault Divorce: సుఖ దుఃఖాల్లో ఒకరికి ఒకరు తోడుగా, నీడగా ఉంటూ జీవితాంతం కలిసి మెలిసి ఉండటమే వివాహానికి నిజమైన అర్థం. మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన జంట జీవితంలో వచ్చే ఒడిదొడుకులను తట్టుకుంటూ, కష్టసుఖాలను అనుభవిస్తూ సాగుతారు. అలాగే దంపతులు మధ్య తగాదాలు, గొడవలు, అలకలు సర్వ సాధారణం. కొంత మంది వాటిని పరిష్కరించుకుంటూ ముందుకెళ్తారు. మరికొందరు వాటితో వేగలెక విడాకులు తీసుకోవాలనుకుంటారు. అయితే విడాకులు తీసుకోవడం చాలా దేశాల్లో అంత సులవేం కాదు. శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు పడుతున్నట్లు ఆధారాలు చూపించాలి. కారణాలు స్పష్టంగా పేర్కొనాలి. ఎదుటి వ్యక్తి తప్పు చేశారని నిరూపించాలి. అప్పుడే న్యాయస్థానాలు విడాకులు మంజూరు చేస్తుంటాయి. కానీ కొన్ని దేశాల్లో కనీసం కారణం కూడా చెప్పాల్సిన అవసరం లేకుండా విడాకులు తీసుకోవచ్చు. ఈ పద్ధతినే నో ఫాల్డ్ డైవర్స్ (No Fault Divorce) అంటారు. నో ఫాల్ట్ డైవర్స్ అంటే అసలేంటో ఇప్పుడు చూద్దాం.
నో ఫాల్ట్ డైవర్స్ అంటే ఏంటి?
ప్రపంచ వ్యాప్తంగా విడాకుల రేటు గణనీయంగా పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. చాలా దేశాల్లోని యువ జంటలు తమ జీవిత భాగస్వామితో వేగలేక విడాకులు తీసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నట్లు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. కేవలం అమెరికా వ్యాప్తంగా సంవత్సరానికి 4.5 మిలియన్ల వివాహాలు జరుగుతున్నట్లు అంచనా. అయితే అందులో 50 శాతానికి పైగా జంటలు విడాకులు తీసుకుంటున్నట్లు నివేదికలో పేర్కొంటున్నాయి. ఇందులో చాలా మంది విడాకులు తీసుకునే సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. ఈ ఇబ్బందులు తప్పించడానికే కొన్ని దేశాల్లో ఈ నో ఫాల్ట్ డైవర్స్ పద్ధతిని అవలంభిస్తున్నారు. నో ఫాల్ట్ డైవర్స్ ప్రకారం.. ఒకరి నుండి ఒకరు విడిపోవడానికి కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు. విడిపోతున్నామని ఇద్దరు స్పష్టంగా చెబితే చాలు విడాకులు మంజూరు చేసేస్తారు.
సోవియట్ యూనియన్ నుంచి వచ్చిన పద్ధతి
ఈ నో ఫాల్ట్ డైవర్స్ మనకు కొద్దిగా కొత్తగా అనిపించవచ్చు. కానీ ఇదేం కొత్తగా వచ్చింది కాదు. ఇది రష్యాలో 100 సంవత్సరాల క్రితమే అవలంభించిన పద్ధతి. 1917 బోల్షివిక్ విప్లవంలో వ్లాదిమిర్ లెనిన్ దేశాన్ని ఆధునికీకరించే బాధ్యతను తీసుకున్నాడు. అంతకు ముందు వరకు రష్యన్ ఆర్థోడాక్స్ చర్చి మాత్రమే వివాహ సంబంధిత అంశాలను డీల్ చేసేది. దీనిని లెనిన్ పూర్తిగా మార్చేశారు. బోల్షివిక్ విప్లవం తర్వాత చోటుచేసుకున్న అనేక మార్పుల్లో ఇది కూడా ఒకటి. అప్పటి వరకు వివాహాలకు తప్పనిసరిగా మతపరమైన దుస్తులే వేసుకోవాల్సి వచ్చేది. తర్వాత ఆ నిబంధనను తొలగించారు. అప్పుడే ఈ నో ఫాల్ట్ డైవర్స్ విధానం కూడా తీసుకొచ్చారు. అయితే ఆ తర్వాత జోసెఫ్ స్టాలిన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విడాకుల పద్ధతి కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తుందని భావించి నిషేధం విధించారు.
Also Read: Weirdest Job: పక్షులను తోలడమే అక్కడ పని- కొన్ని రోజులు ఈ ఉద్యోగం చేస్తే చాలు లక్షాధికారి కావొచ్చు!
నో ఫాల్ట్ డైవర్స్ తో నష్టాలూ ఉన్నాయి
నాణేనికి బొమ్మా బొరుసు ఉన్నట్లుగానే.. నో ఫాల్ట్ డైవర్స్ తో లాభాలు, నష్టాలు రెండూ ఉన్నాయి. పెళ్లి బంధంతో ఒక్కటైన జంట ఆ తర్వాత మనస్పర్థలతో విడిపోవాలనుకున్నప్పుడు ఈ నో ఫాల్ట్ డైవర్స్ తో సులభంగా విడాకులు తీసుకోవచ్చు. ఒకరు తప్పు చేస్తున్నారని నిరూపించలేని అసహాయ పరిస్థితిలో ఈ నో ఫాల్ట్ డైవర్స్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అయితే దీని వల్ల కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం అవుతుందన్న ఆరోపణలు లేకపోలేదు. చిన్న చిన్న కలహాలకు కూడా జంటలు విడిపోతారని, రాజీ పడే మనస్తత్వం ఉండదని నిపుణులు చెబుతున్నారు.