Viral Boys Timetable: పిల్లలు గొప్ప కళాకారులు. చాలా మంది పిల్లల్లో కొన్ని కళలు ఇన్‌బిల్ట్ గా వచ్చేస్తాయి. ఏదైనా చేయడానికి తల్లిదండ్రులను ఒప్పించడానికి, ఇష్టమైన బొమ్మలు కొనిపించుకోవడానికి భలేగా కబుర్లు చెబుతుంటారు. అలాగే స్కూల్ ఎగ్గొట్టడానికి ఆస్కార్ లెవల్ లో నటిస్తుంటారు. ఎక్కువ సేపు ఆడుకోవడానికి, టీవీ చూడటానికి, చాక్లెట్ల కోసం, కేకుల కోసం వారికి ఇష్టమైన వాటి కోసం వాళ్లు చేసే పనులు చాలా సార్లు నవ్వు తెప్పిస్తుంటాయి. వాళ్లు చేసే చిలిపి పనులు భలే సరదాగా ఉంటాయి. ప్రతి పిల్లాడు కొద్దిగా తక్కువా, ఎక్కువగా ఇలాగే ఉంటారు. అచ్చంగా అలాంటి ఓ ఆరేళ్ల పిల్లాడే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. ఆ పిల్లాడు చేసిన ఓ పని ఇప్పుడు ఇంటర్‌నెట్‌ లో హల్ చల్ చేస్తోంది. అంతగా ఆ పిల్లాడు ఏం చేశాడు అనే కదా మీ డౌట్.. అయితే ఇది చదివేయండి.


ఆరేళ్ల పిల్లాడు రోజు మొత్తంలో తాను ఏం చేయాలనుకుంటున్నాడో నిర్ణయించుకుని తనకంటూ ఓ టైం టేబుల్ ను రూపొందించుకున్నాడు. చదువుకోవడానికి, ఆడుకోవడానికి, తినడానికి అంటూ ప్రతి పనికి కొంత టైం కేటాయిస్తూ తయారు చేసుకున్న టైం టేబుల్ ను తన బంధువు ఒకరు సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడంతో అది కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది.


రోజూ ఉదయం 9 గంటలకు నిద్రలేస్తాడట ఆ పిల్లాడు. తర్వాత 9 గంటల నుంచి తొమ్మిదిన్నర వరకు అంటే అరగంట పాటు బ్రష్ చేసుకోవడం, టాయిలెట్ కు వెళ్లడం లాంటి పనులు చేస్తాడు. తర్వాత మరో అరగంట అంటే 10 గంటల వరకు బ్రేక్‌ఫాస్ట్ చేస్తాడట. అలా రోజూ చదువుకోవడానికి 15 నిమిషాలు కేటాయించాడు ఆ పిల్లాడు. అలాగే ఫైటింగ్ టైం అంటూ 3 గంటలు కేటాయించాడు. 30 నిమిషాలు స్నానం చేస్తానని కూడా రాసుకున్నాడు. అయితే చదువుకోవడానికి కేవలం 15 నిమిషాలే కేటాయించడం, అలాగే ఫైటింగ్ చేయాడనికి 3 గంటలు, తాతయ్యతో కలిసి మామిడి పండ్లు తినేందుకు 30 నిమిషాల సమయం ఇవ్వడం చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. 


Also Read: Viral News: ఎప్పటికీ ఆశ కోల్పోకు బ్రో! ఈ ఆన్‌లైన్‌ ఆర్డర్ గురించి తెలిస్తే నిజమే అంటారు!


చీజ్ టైంకు 15 నిమిషాలు, రెడ్ కలర్ కారుతో ఆడుకోవడానికి 2 గంటలు, తాతయ్యతో కలిసి మామిడి పండ్లు తినడానికి 30 నిమిషాలు.. ఇలా ఆ పిల్లాడు టైం కేటాయించడం చాలా మంది నెటిజన్లను ఆకట్టుకుంది. ఈ వైరల్ పోస్టు లైబా అనే ట్విట్టర్ యూజర్ జూన్ 22వ తేదీ రాత్రి 10.25 గంటలకు పోస్టు చేయగా ఇప్పటి వరకు 13 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. వందల్లో కామెంట్లు కూడా వచ్చాయి. చాలా మంది ఆరేళ్ల పిల్లాడి టైం టేబుల్ చూసి రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. 'ఆ పిల్లాడు చాలా తెలివైన వాడ'ని ఓ యూజర్ కామెంట్ పెట్టారు. 'చదువుకోవడానికి 15 నిమిషాలు.. కానీ స్నానం చేయడానికి 30 నిమిషాలు, ఫైటింగ్ కోసం 3 గంటలా' అని మరొకరు నవ్వుతున్న ఎమోజీలు పెట్టి కామెంట్ చేశారు. 'తాతతో కలిసి మామిడి పండ్లు తినడానికి ప్రత్యేకంగా టైం కేటాయించడం బాగుంద'ని మరొకరు కామెంట్లో రాసుకొచ్చారు. 'ఆ పిల్లాడి నిజాయితీ నాకు చాలా నచ్చింది' అని ఓ యూజర్ కామెంట్ చేశారు. 






Join Us on Telegram: https://t.me/abpdesamofficial