Mary Millben: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనను విమర్శించే వాళ్లు కూడా ఇది ఒప్పుకుంటారు. మోదీకి కేవలం భారత్ లోనే కాకుండా విదేశాల్లోనూ అభిమానులు ఉన్నారు. ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొనగా.. ఆఫ్రికా-అమెరికన్ సింగర్ మేరీ మిల్‌బెన్ ప్రధాని కాళ్లకు నమస్కరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


అమెరికాలో ప్రధాని మోదీ మూడ్రోజుల పాటు పర్యటించారు. విజయవంతంగా సాగిన ఈ పర్యటన ముగింపు నేపథ్యంలో యునైటెడ్ స్టేట్స్ ఇండియన్ కమ్యూనిటీ ఫౌండేషన్ ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. రోనాల్డ్ రీగన్ బిల్డింగ్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆఫ్రికా-అమెరికన్ హాలీవుడ్ నటి, సింగర్ మేరీ మిల్‌బెన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గతంలో ఆమె భారత జాతీయ గీతాన్ని, ఓం జై జగదీశ హరే పాటను ఆలపించి భారతీయులకు చేరువయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మరోసారి భారత జాతీయ గీతం జనగణమనను ఆలపించారు. అనంతరం స్టేజీ పైనే ఉన్న ప్రధాన మంత్రి వద్దకు వచ్చి వంగి కాళ్లను తాకి నమస్కరించారు. 






అనంతరం మాట్లాడిన మేరీ మిల్‌బెన్ భారత ప్రధాని నరేంద్ర మోదీ కోసం భారత జాతీయ గీతాన్ని ఆలపించడం ఎంతో గౌరవంగా ఉందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. భారతీయులు తనను ఒక కుటుంబ సభ్యురాలిగా భావించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అలాగే నలుగురు అమెరికా అధ్యక్షుల కోసం అమెరికన్ దేశ భక్తి గీతాన్ని పాడటం చాలా సంతోషంగా ఉందని ఆమె వెల్లడించారు. అమెరికన్, భారత జాతీయ గీతాలు రెండు కూడా ప్రజాస్వామ్య స్వేచ్ఛకు ఆదర్శంగా ఉంటాయని మేరీ మిల్‌బెన్ వ్యాఖ్యానించారు. 


Also Read: ప్రధాని మోదీకి టీషర్ట్ గిఫ్ట్‌గా ఇచ్చిన బైడెన్, దానిపై ఇంట్రెస్టింగ్ కొటేషన్


మేరీ జోరీ మిల్‌బెన్ ఎవరు?


మేరీ జోరీ మిల్‌బెన్ ఓక్లహోమా నగరంలోని ఓ క్రైస్తవ కుటుంబంలో పుట్టారు. మేరీ జోరీ మిల్‌బెన్ తల్లి ఆల్తియా మిల్‌బెన్‌ పెంటెకోస్టల్ లో సంగీత పాస్టర్ గా పని చేసే వారు. అలా మేరీ జోరీకి సంగీతం పట్ల ఇష్టం పెరిగింది. మేరీ జోరీ ఐదేళ్ల నుంచే పాడటం మొదలు పెట్టారు. ఐదేళ్ల వయస్సులో ఓక్లహోమా నగరంలోని వైల్డ్ వుడ్ క్రిస్టియన్ చర్చిలో పిల్లల బృందంతో కలిసి ఆమె పాటలు పాడేవారు. గత సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మేరీ జోరీ మిల్‌బెన్‌ ను దేశానికి ఆహ్వానించింది భారత ప్రభుత్వం. ఆ సమయంలో అమెరికా కల్చరల్ అంబాసిడర్ గా ఉన్న మేరీ జోరీ మిల్‌బెన్ భారత్ ను సందర్శించి ఇక్కడ జాతీయ గీతాన్ని, ఓం జై జగదీశ హరే గీతాన్ని ఆలపించారు. అలా భారతీయులకు సుపరిచితులయ్యారు. 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial