ఆందోళన, ఆత్రుత, ఆరాటం అనేవి కేవలం మనుషులకు మాత్రమే కాదు. మన పెంపుడు జంతువులకు కూడా ఉంటాయి. కొత్త ఇంట్లోకి వెళ్లినప్పుడు.. అలవాటైన వారి నుంచి విడిపోయినప్పుడు.. వాతావరణం సరిగ్గా లేనప్పుడు, టపాసులు పేలేటప్పుడు, యజమాని ఇంటిని వదిలి వెళ్లినప్పుడు పెంపుడు జంతువులు కంగారూ పడుతూ ఉంటాయి.


అయితే ఈ విషయాన్ని అవి మనుషులకు చెప్పలేకపోవచ్చు కానీ.. కొన్ని విధాలుగా అవి మనతో కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నిస్తాయి. కుక్కలు కంగారుకు లోనయినప్పుడు ఆ ప్రభావం వాటి జీవితం మీద పడనుంది. గతంలో పబ్లిష్ అయిన ఒక సైంటిఫిక్ రీసెర్చ్‌లో 70 శాతం వరకు కుక్కలు తమ కంగారును తెలపడానికి కొన్ని లక్షణాలను ప్రదర్శిస్తాయట.


చుట్టుపక్కల ఎవరూ లేకపోతే కుక్కలకు కంగారు ఎక్కువయ్యే అవకాశం ఉందంట. ఆ సమయంలో అవి మరింత కంగారుకు లోనవుతాయని తెలుస్తోంది. ఒంటరిగా ఉన్నప్పుడు అవి కంగారుకు లోనవ్వకుండా ఉండేందుకు కొందరు యానిమల్ టెక్ సైంటిస్టులు ఒక డివైస్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది.


దీనికి డాగ్ ఫోన్ అని పేరు పెట్టారు. ఈ ప్రత్యేకమైన డివైస్‌ను బ్రిటన్, ఫిన్‌లాండ్‌కు చెందిన పలువురు యానిమల్ టెక్ సైంటిస్టులు రూపొందించారు. జంతువుకు, యజమానికి మధ్య ఎమర్జెన్సీ కమ్యూనికేషన్ కోసం దీన్ని తయారు చేశారు.


యాక్సెలరో మీటర్‌ని ఒక బంతిలో ఉంచి కుక్కకు అందించాలి. ఆ బంతిని కుక్క షేక్ చేసినప్పుడు పక్కనే ఉన్న ల్యాప్‌టాప్ ట్రిగ్గర్ అయి వెంటనే వీడియో కాల్ ఆన్ అవుతుంది. ఇటువంటి డివైస్‌ను తయారు చేయడం ఇదే మొదటిసారి. గ్లాస్గో యూనివర్సిటీకి చెందిన ఇల్యేనా హిర్స్‌కిజ్ డగ్లస్.. ఫిన్‌లాండ్‌లోని ఆల్టో యూనివర్సిటీలో ఉన్న తన కొలీగ్స్‌తో కలిసి దీన్ని రూపొందించారు.


అయితే జాక్(దీన్ని మొదట పరీక్షించిన కుక్క పేరు) బంతిని తీసుకున్నప్పుడు కాల్ వెళ్తుందన్న సంగతి దానికి తెలిసిందా.. లేదా అన్న సంగతి తెలియరాలేదు. ఇది ప్రస్తుతం ఇంకా అనాలసిస్ దశలోనే ఉంది. దీనికి సంబంధించి మరిన్ని ప్రయోగాలు జరగాల్సి ఉంది.