ఏదో అనుకుంటే ఇంకేదో అయింది..
మంచి చేయాలనుకోవటం మంచిదే. కానీ కొన్ని సందర్భాల్లో అదే మన కొంప ముంచుతుంది. నా మానాన నేను వెళ్లిపోక, ఎందుకొచ్చిన గొడవ ఇదంతా అని చివరకు బాధపడాల్సి వస్తుంది. ముంబయిలో ఓ మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. వీధిలో కనిపించిన ఓ పిల్లోడికి వడాపావ్ ఇచ్చి చివరకు రూ. 5 లక్షలు పోగొట్టుకుంది. వడాపావ్ ఇవ్వటానికి, డబ్బు పోగొట్టుకోటానికి సంబంధమేంటి అనుకుంటున్నారా..? ఈ మిస్టరీ ఏంటో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
ఓ బ్యాగ్ బదులు మరో బ్యాగ్ ఇచ్చి..
ముంబయిలోని గోకుల్‌ధామ్ కాలనీలో నివాసముండే ఓ మహిళ తన కూతురి పెళ్లికోసం తీసుకున్న లోన్‌ను కట్టేందుకు బంగారం కుదవ పెట్టాలని అనుకుంది. తన వద్ద ఉన్న 10 తులాల గోల్డ్ తీసుకుని బ్యాంక్‌కు బయల్దేరింది. చేతిలో రెండు బ్యాగ్స్ ఉన్నాయి. అందులో ఓ కవర్‌లో వడాపావ్ ఉంది. మార్గమధ్యలో ఆమెకు పక్కనే ఓ చిన్న పిల్లాడు కనిపించాడు. వెంటనే ఆ పిల్లాడికి కవర్ ఇచ్చేసింది. గోల్డ్‌బ్యాగ్‌ని చాలా జాగ్రత్తగా పట్టుకుని బ్యాంక్‌కి వెళ్లింది. తీరిగ్గా బ్యాగ్ ఓపెన్ చేసి ఒక్కసారిగా షాక్ అయింది. అందులో బంగారం కనిపించకపోయే సరికి కంగారు పడిపోయింది. అప్పుడు కానీ అర్థం కాలేదు ఆమెకి. గోల్డ్ ఉన్న బ్యాగ్ పిల్లాడికి ఇచ్చి మామూలు హ్యాండ్ బ్యాంగ్ తన వద్దే ఉంచుకుంది. వెంటనే ఆ ప్లేస్‌కి వెళ్లి వెతికితే పిల్లాడు కనిపించలేదు. ఏం చేయాలో అర్థం కాక పోలీసులను ఆశ్రయించింది.
మురికి కాలువలో గోల్డ్ బ్యాగ్
పోలీసులు బృందం ప్రత్యేక విచారణ చేపట్టింది. ఆ ఏరియాలోని సీసీ ఫుటేజ్‌ని పరిశీలించింది. అందులో ఓ పిల్లాడు, అతని తల్లి కనిపించారు. వారి వద్దకు వెళ్లి ఆరా తీశారు. అప్పుడు కానీ అసలు విషయం బయట పడలేదు. పిల్లాడికి ఇచ్చిన వడాపావ్ బాగా ఎండిపోయిందని, తినాలని
అనిపించక కాలువలో పారేశామని చెప్పింది ఆ పిల్లాడి తల్లి. ఆ కాలువ దగ్గర్లోని సీసీ ఫుటేజ్‌ని పరిశీలించారు పోలీసులు. ఓ ఎలుక ఆ బ్యాగ్‌లో ఉండటాన్ని గమనించారు. వెంటనే ఆ ఎలుకను వెంబడించి బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అందులో ఉంచిన 10 తులాల బంగారు ఆభరణాలు భద్రంగా ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. బంగారం పోయిందని ఆశలు వదులుకున్న మహిళ, గోల్డ్ అంతా రికవరీ అయ్యే సరికి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఈ స్టోరీ విని స్థానికులంతా అవాక్కవుతున్నారు. అక్కడ సీసీ కెమెరాలు లేకపోయుంటే ఆ కవర్ దొరకటం చాలా కష్టపోయేదని, లక్కీగా అక్కడ కెమెరాలు ఉండటం వల్ల బంగారాన్ని గుర్తించటం సులువైందని అంటున్నారు పోలీసులు.