Emojis Essential Tool of communication: ఒకప్పుడు సమాచారం చేరవేయాలన్నా, క్షేమ సమాచారాలు, భావాలు, భావోద్వేగాలు ఏది పంచుకోవాలన్నా ఉత్తరాలు ఉండేవి. చక్కగా అన్ని విషయాలను లెటర్‌ (Letters)లో రాసి, దాన్ని పోస్ట్‌ చేసి, సమాధానం కోసం ఎదురు చూసేవాళ్లు. ఆపై టెలిఫోన్, మొబైల్స్ (Mobiles For Communication) లాంటివి కమ్యూనికేషన్ రంగంలో సరికొత్త మార్పులు తీసుకొచ్చాయి. మారుతున్న రోజులతోపాటు టెక్నాలజీ పెరిగిపోయింది. ఈ క్రమంలో సోషల్‌ మీడియా వచ్చేసింది. ఏ విషయమైనా నిమిషాల్లో అవతలి వ్యక్తికి చేరుకుంటుంది. 


టెక్నాలజీతో మారిన కమ్యూనికేషన్
వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా ప్లాట్‌ఫాం ఏదైనా ఒక్క మెసేజ్‌ చాలు సమాచారం అర్థమైపోతుంది. వాట్సాప్‌ వచ్చిన తొలినాళ్లలో ఇంగ్లిష్‌ లేదా టింగ్లిష్‌లో చాట్‌ చేసుకునేవాళ్లు. తర్వాత తర్వాత ఆ ఛాటింగ్‌ కాస్తా.. షార్ట్‌కట్స్‌లోకి మారిపోయింది. పదం మొత్తం రాసేకంటే షార్ట్‌కట్‌ పదాలే రాస్తే చాలని భావించేవారు యూజర్స్‌. దీంతో "బ్రదర్‌" కాస్తా "బ్రో" అయ్యాడు. "టేక్‌కేర్‌" కాస్తా "టీసీ" అయ్యింది. "As Early As Possible" కాస్తా.. "ASAP"గా మారిపోయింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఆ షార్ట్‌కట్స్‌ని కాస్తా ఎమోజీలు రీప్లేస్‌ చేసేశాయి. ఏదైనా విషయం చెప్పాలన్నా, ఫీలింగ్స్‌ని వ్యక్తపరచాలన్నా ఎమోజీలనే వాడుతున్నారు చాలామంది. నిజం చెప్పాలంటే మెసేజ్‌ అంటే షార్ట్‌కట్స్‌ మాత్రమే రాయాలి అనేలా అలవాటు అయిపోయింది ఈ జనరేషన్‌ వాళ్లకి. మెసేజ్‌లు కాకుండా పేపర్‌ మీద ఏదైనా ఇన్ఫర్మేషన్‌ రాయాలన్నా షార్ట్‌కట్స్‌నే వాడుతున్నారు. దేనికైనా రియాక్ట్‌ అవ్వాలంటే కేవలం ఎమోజీలను మాత్రమే వాడే పరిస్థితులు వచ్చాయి. మరి ఆ షార్ట్‌ కట్స్‌, ఎమోజీలతో లాభమా? నష్టమా? ఈ వివరాలపై ఓ లుక్కేద్దామా.      
ఎమోజీలతో అభిప్రాయాన్ని చెబుతున్నారా..
ఏదైనా ఒక కొత్త పద్ధతి లేదా ఒక వస్తువు మార్కెట్‌లోకి వస్తే అటు లాభాలు ఉంటాయి, ఇటు నష్టాలు ఉంటాయి. టెక్నాలజీ విషయం కూడా అంతే. అలానే చాటింగ్‌లో మనం వాడే ఈ షార్ట్‌కట్స్‌, ఎమోజీల వల్ల లాభాలు, నష్టాలు రెండూ ఉన్నాయి. మనలోని భావాలను, మనం ఏమి అనుకుంటున్నాం అనే విషయాన్ని కేవలం టెక్ట్స్‌ రూపంలో చెప్పలేం. అలాంటప్పుడు ఎమోజీలు కచ్చితంగా మనకు ఉపయోగపడతాయి. అవతల వ్యక్తి అన్న మాటలకు మనం ఎలాంటి మూడ్‌లో సమాధానం చెప్తున్నాం అనే విషయాన్ని ఎమోజీలతో కచ్చితంగా రిప్రజెంట్ చేయొచ్చన్నది కొందరు నిపుణుల అభిప్రాయం. అవతల వ్యక్తి మనల్ని హేళన చేసినా, తిట్టినా, అతను అన్న మాట నచ్చలేదని అనుకున్నా.. సీరియస్‌ ఎమోజీతో సమాధానం చెప్పొచ్చు. అలానే నవ్వుతూ, చెప్పిన జోక్‌ బాలేదని వాంతి వస్తున్నట్లు లాంటి ఎమోజీలతో మన భావాలను రిప్రజెంట్ చేయొచ్చు. జస్ట్‌ ఒక్క క్లిక్‌తో మనలోని ఫీలింగ్స్‌ అన్నీ వ్యక్త పరచవచ్చు. ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్ట్‌కి మనం క్లిక్‌ చేసే ఒక్క బటన్‌తో వాళ్లకు మన అభిప్రాయం తెలపవచ్చు. అలానే ఇన్‌స్టాలో మనం ఇచ్చే ఒక్క లవ్‌ సింబల్‌ ఎన్నో భావాలను వ్యక్త పరుస్తుంది. ఇక షార్ట్‌కట్‌ ఛాటింగ్‌ విషయానికి వస్తే.. తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్‌ ఇవ్వొచ్చు. పది లైన్లలో రాసే విషయాన్ని తక్కువగా చేసి రాయొచ్చు. 
ఎమోజీలతో నష్టాలు సైతం!
ఈ ఎమోజీల వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఒక్కోసారి ఆ ఎమోజీలే మిస్‌ ఇన్ఫర్మేషన్‌ ఇచ్చే అవకాశం ఉంటుంది. అవతలి వాళ్లు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. మనం థ్యాంక్స్‌ అనే ఉద్దేశంతో నమస్కారం ఎమోజీ పంపితే.. అది వాళ్లకు 'నీకు దండం రా అయ్యా' అని అర్థం అయ్యే ప్రమాదం ఉంటుంది. ఒక్కోసారి కడుపుబ్బా నవ్వి.. కళ్లలో నీళ్లు వచ్చేశాయి అనే ఉద్దేశంతో పంపే ఎమోజీ.. ఏడుస్తున్నారు ఏంటి అని అనుకునే ప్రమాదం ఉంది. అంతేకాదు.. చాలామంది ఎమోజీలకు అర్థం తెలియకుండా వాడటం వల్ల వాళ్లు చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్‌ వేరేలా అర్థం అయ్యే అవకాశం కూడా ఉంది. దాంట్లో మన రోజువారి జీవితంలో ఎన్నో ఎదుర్కొనే ఉంటాం. ఎంతోమంది స్టేటస్‌లో, మెసేజుల్లో తప్పుగా పెట్టే ఎమోజీల వల్ల మనం కూడా మన ఫ్రెండ్స్‌ని తప్పుగా అర్థం చేసుకునే సందర్భాలు కూడా చాలానే ఉంటాయి. ఒకప్పుడు టెలిగ్రామ్‌లు ఉన్నప్పుడు చాలా లిమిటెడ్‌గా రాయాల్సి వచ్చేది. దాంతో ఎక్కువ సమాచారాన్ని చాలా చిన్నగా మార్చి పంపేవాళ్లు.. అలా షార్ట్‌ చేయడంలో ఒక్కోసారి మిస్‌ ఇన్ఫర్మేషన్‌ చేరేది. ఇప్పుడు వాట్సాప్‌ షార్ట్‌కట్స్‌ వల్ల కూడా అదే ప్రమాదం జరుగుతోంది. ఒక్కోసారి ఇవతలి వాళ్లు వాడే షార్ట్‌కట్స్‌ అవతలి వాళ్లకి అర్థం అవ్వక తప్పుగా అర్థమయ్యే ప్రమాదం ఉంది. అంతేకాదు.. వాట్సాప్‌ ఇప్పుడు ప్రతి ఒక్కరి ఫోన్‌లో ఉంటోంది. పిల్లలు, పెద్దలు, ముసలివాళ్లు ప్రతి ఒక్కరు వాట్సాప్‌ యూజర్లే. మనం ఒక్కోసారి పంపే మెసేజ్‌లు, ఎమోజీలు పెద్దవాళ్లకు అర్థం అవ్వవు. వాటిని ఎలా అర్థం చేసుకోవాలో కూడా వాళ్లకు అర్థం కాదు. 
మానసికంగా కూడా ప్రభావం చూపుతాయి
ఎమోజీలకు సంబంధించి కేవలం సమాచారం తప్పుగా అర్థం చేసుకోవడమే కాదు. మానసికంగా కూడా చాలా ప్రభావం చూపిస్తుంది. రాసే రాతను మరిచిపోతున్నారు చాలామంది. ఏది చెప్పాలన్నా ఎమోజీలతో మాత్రమే చెప్తున్నారు. అది మనిషి మానసిక స్థితిపై కూడా ప్రభావం చూపిస్తుందని సర్వేలు చెప్తున్నాయి. అలాంటిదే అమెరికాలో జరిగింది. ఎమోజీలతో చాటింగ్‌ చేయడం బాగా అలవాటు పడిపోయిన ఒక కుర్రాడు.. తన ముఖంలో ఎక్స్‌ప్రెషన్స్‌ ఇవ్వడం మరిచిపోయాడు. తాను ఏది ఎక్స్‌ప్రెస్‌ చేయాలన్నా.. కేవలం ఎమోజీలను మాత్రమే చూపిస్తున్నాడని అప్పట్లో వార్త వైరల్ అయింది.  


షార్ట్‌కట్‌ మెసేజ్‌లు, ఎమోజీలతో ఛాటింగ్‌ ఒక్కోసారి మన టైంని సేవ్‌ చేస్తాయి. ఒక్కోసారి మనల్ని ఇబ్బందుల్లో పడేస్తాయి. ముఖ్యమైన సమాచారం ఏదైనా అవతలి వాళ్లకు అర్థం కాకపోతే అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి.. సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి దేనైనా వాడాలి. అప్పుడు ఇబ్బందులు కలగవు. టెక్నాలజీని ఎంత వరకు తీసుకోవాలో, ఎంత వరకు వాడాలో అంతే వాడితేనే అది మనకు మంచి చేస్తుందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎప్పుడైనా ఇలా షార్ట్‌కట్‌ మెసేజ్‌లు, ఎమోజీలతో ఇబ్బందులు పడ్డారా? ఓసారి గుర్తుచేసుకోండి.