Virat Kohli ICC Rankings: తాజాగా ప్రక‌టించిన‌ ఐసీసీ టెస్ట్‌ బ్యాటర్‌ ర్యాంకింగ్స్‌లో స్టార్ బ్యాట‌ర్ కింగ్‌ కోహ్లీ స‌త్తా చాటాడు. ఐసీసీ టెస్ట్‌ బ్యాటర్‌ ర్యాంకింగ్స్‌ (ICC Test Rankings)లో రన్‌ మెషీన్‌ విరాట్‌ కోహ్లి (Virat Kohli) తొమ్మిదో స్థానానికి ఎగబాకాడు. భారత్‌ నుంచి టాప్‌ 10లో చోటు దక్కించుకున్న ఏకైక బ్యాటర్‌ విరాటే కావడం విశేషం. ద‌క్షిణాఫ్రికా గ‌డ్డపై తొలి టెస్టులో అర్ధ శత‌కంతో రాణించిన విరాట్... రెండో టెస్ట్‌లో 76 పరుగులు చేశాడు. గ‌త రెండేళ్లలో కోహ్లీకి ఇదే మెరుగైన ర్యాంక్.  ఐసీసీ టెస్ట్‌ బ్యాటర్‌ ర్యాంకింగ్స్‌లో వికెట్ కీప‌ర్ రిష‌భ్ పంత్ 12వ ర్యాంక్‌లో కొన‌సాగ‌తున్నాడు. 2022లో కారు యాక్సిడెంట్ కార‌ణంగా ఏడాదిపాటు ఆట‌కు దూర‌మైన పంత్ టాప్ 15లో ఒక‌డిగా నిల‌వ‌డం విశేషం. మ‌రోవైపు రోహిత్ శ‌ర్మ (Rohit Sharma)  నాలుగు స్థానాలు దిగ‌జారి 14వ ర్యాంక్‌తో స‌రిపెట్టుకున్నాడు. బంగ్లాదేశ్ సిరీస్‌లో నిల‌క‌డ‌గా ఆడిన‌ న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియ‌మ్సన్  అగ్రస్థానం నిల‌బెట్టుకున్నాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్‌, ఆస్ట్రేలియా స్టార్ బ్యాట‌ర్ స్టీవ్ స్మిత్‌ రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఆసీస్ ఓపెన‌ర్ ఉస్మాన్ ఖ‌వాజా నాలుగో స్థానంలో, బాబ‌ర్ ఆజాం ఐదో స్థానంలో కొన‌సాగుతున్నారు.

 

బౌలింగ్‌లో మన ఆధిపత్యమే

బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ఏకంగా ముగ్గురు భార‌త బౌల‌ర్లు టాప్ 5లో నిలిచారు.
  అశ్విన్ అగ్రస్థానాన్ని కాపాడుకోగా.. జడేజా, బుమ్రా నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు. షమీ రెండు స్థానాలు పడిపోయి 20వ స్థానానికి చేరగా.. సిరాజ్‌ 30, అక్షర్‌ పటేల్‌ 32 స్థానాల్లో నిలిచారు.  ఆల్‌రౌండ‌ర్ల జాబితాలో జ‌డేజా అగ్రస్థానంలో, అశ్విన్ రెండో స్థానంలో కొన‌సాగుతుండ‌గా.. బంగ్లాదేశ్ కెప్టెన్ ష‌కిబుల్ హ‌స‌న్‌ మూడో స్థానంలో నిలిచాడు. టీమిండియా యువ ఆల్‌రౌండ‌ర్ అక్షర్ ప‌టేల్ 291 రేటింగ్స్‌తో ఏదో స్థానంలో ఉన్నాడు. టీమ్‌ ర్యాంకింగ్స్‌ విషయానికొస్తే.. ఈ విభాగంలో టీమిండియా టాప్‌లో కొనసాగుతుండగా.. ఆసీస్‌, ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, శ్రీలంక, వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌, జింబాబ్వే టాప్‌ 10లో నిలిచాయి.

 

నిప్పులు చెరిగిన సిరాజ్‌

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో మహ్మద్‌ సిరాజ్‌.. కెరీర్‌లోనే అద్భుత స్పెల్‌తో సఫారీలకు ముచ్చెమటలు పట్టించాడు. సిరాజ్‌ మియా నిప్పులు చెరిగే బంతులకు ప్రొటీస్‌ బౌలర్ల వద్ద సమాధానమే కరువైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికాకు తొలి ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లోనే సిరాజ్ షాకిచ్చాడు. ఆ జట్టు ఓపెనర్ మాక్రమ్‌ను 2 పరుగులకే పెవిలియన్ చేర్చాడు. యశస్వి జైస్వాల్‌కు క్యాచ్ ఇచ్చిన మాక్రమ్ ఔటయ్యాడు. తన తర్వాతి ఓవర్లోనే మరోసారి చెలరేగిన సిరాజ్ సౌతాఫ్రికా కెప్టెన్‌ ఎల్గర్‌ను 4 పరుగులకే క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో సౌతాఫ్రికా జట్టు 8 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. కాసేపటికే టోనీ డి జోర్జి(2)ని కూడా ఔట్ చేశాడు. ఒకే ఓవర్లో బెడింగ్‌హామ్‌ (12), మార్కో జాన్‌సెన్ (0)ని ఔట్ చేసి సిరాజ్‌ ఐదు వికెట్లను పూర్తి చేసుకున్నాడు. సిరాజ్‌ వేసిన తర్వాతి ఓవర్లో వెరినే (15).. స్లిప్‌లో శుభ్‌మన్‌కు చిక్కాడు. దక్షిణాఫ్రికా 18 ఓవర్లకు 45 పరుగులు చేసి ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో నిలిచింది. ట్రిస్టన్‌ స్టబ్స్‌ను బుమ్రా.. కేశవ్‌ మహరాజ్‌ను ముఖేష్‌కుమార్‌ అవుట్‌ చేశారు. దీంతో 50 పరుగులకే సఫారీలు ఎనిమిది వికెట్లు కోల్పోయారు. అనంతరం బుమ్రా, ముఖేష్‌ చెరో వికెట్‌ తీయడంతో దక్షిణాఫ్రికా 55 పరుగులకే కుప్పకూలింది.