International Dogs Day | జంతు జీవాల్లో మనిషికి అత్యంత ఆప్త మిత్రులు, పురాతన మిత్రులు శునకాలేనని కుక్కలపై జరిపిన ఒక డీఎన్ఏ అధ్యయనం చెప్తోంది. ఇతర ఏ జంతువులను పెంచుకోక ముందు నుంచే మనిషి కుక్కలను పెంచుకుంటున్నాడు. మనిషి కుక్కలను పెంచడమనేది గత 11,000 సంవత్సరాల నుంచీ జరుగుతున్నది. మంచుయుగం అంతమైనప్పటి నుంచీ శునకాలు మనకు మిత్రులుగా ఉన్న విషయ ఈ అధ్యయనంలో వెల్లడైంది.
మనిషికి నమ్మకమైన ఆప్తమిత్రులు శునకాలే..
శునకాలు మనిషికి అత్యంత నమ్మకమైన మిత్రులు. విశ్వాసంలో శునకాలను మించిన జంతువు లేదనేది అక్షర సత్యం. శునకాలు నేటి కాలంలో కాపాలా జంతువుగానే కాకుండా ఇంటి మనిషిగా చెలామణీ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా రాజభోగాలు అనుభవిస్తున్న శునకాలు అనేకం ఉన్నాయి. ఒంటరి జీవితం గడిపే చాలా మంది శునకాలను పెంచుకుంటూ ఆనందం పొందుతుంటారు. మనిషికి ఇంత దగ్గరగా మసిలే జంతువు శునకం మాత్రమే. పూర్వకాలం నుంచి కూడా వేటకు వెళ్లేవారు తమ వెంట రక్షణగా శునకాలను తీసుకెళ్లేవారు.
పోలీసులకు క్రైం ఇన్వెస్టిగేషన్‌లో శునకాల పాత్ర గురించి చెప్పాల్సిన పనిలేదు. వాసన పసిగట్టడంలో శునకాలకున్న గాఢత మరే ఇతర జంతువుకు ఉండదు. అందుకే బాంబుల నిర్వీర్యం కోసం కూడా డాగ్ స్క్వాగ్ పోలీసులు వినియోగిస్తుంటారు.
మనిషి జీవితాన్ని నిత్యం కాంతివంతంగా మార్చడంలో కీలకంగా వ్యవహరించే శునకాలకు కూడా ఒక ప్రత్యేకమైన రోజుంది. ఆగస్టు 26ను అంతర్జాతీయ శునకాల దినోత్సవంగా జరుపుకొంటారు. మనిషి ఎమోషన్‌లను, కష్టాలను అర్థం చేసుకోగల సత్తా నేర్పరితనం శునకాల సొంతం. అతి తక్కువ సమయంలోనే మనుష్యులతో కలిసిపోగల జంతువు ఇది. అలాంటి శునకాలకు ప్రత్యేకంగా ఒకరోజు కేటాయించి పండగలా జరుపుకోవడం వాటి గొప్పతనాన్ని గుర్తించడమే.
ఎలా మొదలైంది...
అంతర్జాతీయ శునకాల దినోత్సవాన్ని 2004 నుంచి జరుపుకొంటున్నారు. కొల్లీన్ పేజ్ అనే జంతు ప్రేమికురాలు ప్రపంచంలోనే మొదటిసారిగా 2004లో శునకాల దినోత్సవాన్ని మొదలుపెట్టారు. `షెల్టీ` అనే శునకాన్ని ఆగస్టు 26న కొల్లీన్ పేజ్ తన కుటుంబంలోకి తెచ్చుకుంది. అప్పటికి ఆమె వయసు కేవలం పది సంవత్సరాలు. ఆ రోజునే న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీ అధికారికంగా శునకాల దినోత్సవంగా ప్రకటించింది. శునకాలను పరిరక్షించడం, వాటి జాతులను కాపాడటం, జంతు హింస నుంచి రక్షణతోపాటు శునకాలను దత్తత ఇచ్చే కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుడుతూ న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీ నిర్ణయం తీసుకుంది.
శునకాల కోసం అధికారిక వెబ్సైట్
శునకాల పరిరక్షణతోపాటు వాటి వివరాలను వెల్లడించేలా అధికారికంగా ఒక వెబ్‌సైట్ కూడా ఉంది. అందులో శునక జాతులు, వాటి వివరాలు, హింస నుంచి కాపాడబడిన శునకాలు, ఎక్కడెక్కడ శునకాలను సంరక్షిస్తున్నారు.. విధుల్లో వీరోచితంగా కష్టపడుతున్న శునకాల వివరాలన్నీ ఈ వెబ్‌సైట్‌లో పొందుపరచడం విశేషం. తమ జీవితాలను పణంగా పెట్టి మరీ శునకాలు యజమానుల ప్రాణాలను కాపాడటం చాలా సంఘటనల్లో చూశాం. తిన్న తిండికి విశ్వాసం చూపించి చెప్పిన పనిని చేయడంలో శునకాలను మించిన జంతువు ఉండదు. అందుకే ఈ శునకాలు మనిషికి అత్యంత ప్రీతిపాత్రమైనవిగా మారిపోయాయి. విశ్వాసం గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు మనిషిని నమ్మినా నమ్మకపోయినా శునకాలను గుడ్డిగా నమ్మవచ్చని చెబుతుంటారు.
Also Read: Viral News: రెంట్ పెంచలేదు, మా ఇంటి ఓనర్ చాలా మంచోడు - ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారా!