Comet C2023 A3 Rare Pictures: ఆకాశంలో అద్భుతం జరిగింది. ఖగోళంలో ఓ అరుదైన తోకచుక్క దర్శనమిచ్చింది. సాధారణంగా తోకచుక్కలు కనిపించడం మామూలే అయినా.. దాదాపు 80 వేల ఏళ్ల క్రితం మన పూర్వీకులు చూసిన ఓ తోకచుక్క ఇప్పుడు మళ్లీ దర్శనమిచ్చింది. 'కామెట్ సి 2023 ఏ3'గా పిలిచే ఈ తోకచుక్కను.. శుచిన్‌షాన్ - అట్లాస్ పేరుతో పిలుస్తున్నారు. చైనా సైన్సెస్ అకాడమీకి చెందిన పర్పుల్ మౌంటెయిన్ అబ్జర్వేటరీ, హవాయి, చిలీ, దక్షిణాఫ్రికాలకు చెందిన 4 టెలిస్కోపుల సమూహం.. ఆస్టరాయిడ్ టెరిస్ట్రియల్ ఇంపాక్ట్ లాస్ అలర్ట్ సిస్టమ్ ఈ తోకచుక్కను గుర్తించాయి. అక్టోబర్ మొదటి వారంలో 'కామెట్ C/2023 A3' తోకచుక్క దృశ్యాలను భారత్‌కు చెందిన కొంతమంది స్టార్‌గేజర్స్ క్లిక్ చేశారు.


ఏపీలోని తిరుపతిలో


అటు, ఏపీలోని తిరుపతిలో ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. తిరుపతికి చెందిన ఆస్ట్రో ఫొటోగ్రాఫర్ డాక్టర్ అవినాశ్ ముక్కామల ఈ ఫొటోలు తీశారు. సోషల్ మీడియాలో వీటిని షేర్ చేయగా వైరల్‌గా మారాయి. మరోవైపు లద్దాఖ్, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లోని ఆస్ట్రో ఫొటోగ్రాఫర్‌లు ఈ అరుదైన దృశ్యాన్ని తమ కెమెరాల్లో బంధించారు. 



భారత్‌లోని ఈ ప్రాంతాల్లో..


లడఖ్‌లోని హన్‌లేలో గోంగ్మా లా:  అద్భుతమైన ఫోటోను క్లిక్‌మనిపించేందుకు ఆస్ట్రోఫోటోగ్రఫీ మాస్టర్ క్లాస్ బృందం సముద్ర మట్టానికి ఈ నెల 1వ తేదీన 4,880 మీటర్ల ఎత్తులో ప్రయాణించింది. ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉన్నా వారు ఉత్సాహంతో ఫోటోను సంగ్రహించారు. టీమ్‌లో చాలా మంది మొదటిసారి ఖగోళ ఫోటోగ్రాఫర్లు.. కానీ వారు కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటూ ఈ పనిని సాధించారు. ఈ బృందంలో అభినవ్ సింఘై, అతిష్ అమన్, లక్ష్మీ నారాయణ, ప్రీతమ్ పాణిగ్రాహి, స్మితా సింగ్, అనుజ్ సింగ్, అంగ్‌చోక్ పద్మ ఉన్నారు.







మహాబలిపురం సమీపంలో: తమిళనాడులోని మహాబలిపురం సమీపంలో ఈ నెల 4వ తేదీన ఆస్ట్రో ఫోటోగ్రాఫర్ సత్యనారాయణన్ శ్రీధర్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో కామెట్ అద్భుతమైన ఫోటోను షేర్ చేశారు. 'అనుకూలమైన వాతావరణ పరిస్థితుల కారణంగా, మేము దాన్ని కోల్పోయే లోపు కామెట్‌ను పట్టుకోవడానికి ఓ యాత్రను ప్లాన్ చేశాం. తోకచుక్క సముద్రానికి దగ్గరగా వేలాడుతున్న మేఘపు తెర నుంచి బయటకు వచ్చింది. నిజానికి దాన్ని పూర్తిగా సంగ్రహించడానికి నేను ఫోకల్ లెంగ్త్‌ని 24 మిమీకి తగ్గించాల్సి వచ్చింది!' అని ఆయన పేర్కొన్నారు.




హైదరాబాద్‌లో..


ఈ నెల 5వ తేదీన తెలంగాణలోని హైదరాబాద్‌కు చెందిన 'X' యూజర్ @itsardnepu, యానిమేషన్ ప్రొఫెషనల్, ఔత్సాహిక వన్యప్రాణులు, ఖగోళ ఫోటోగ్రాఫర్.. కామెట్ అందమైన ఫోటోను పోస్ట్ చేశారు. "కామెట్ C/2023-A3 Tsuchinshan-ATLASతో ఒక క్లోజప్, హైదరాబాద్, తెలంగాణ, భారతదేశంలోని ఔట్‌స్కర్ట్స్ నుంచి సంగ్రహించబడింది." అని ట్వీట్‌లో పేర్కొన్నారు.




Also Read: Devaragattu: ఉత్సవమూర్తుల కోసం పోరాటం - దేవరగట్టు కర్రల సమరం, 70 మందికి గాయాలు