Devaragattu Bunny Utsavam In Kurnool: ఓ సంప్రదాయం.. ఓ ఉత్సవం.. ఉత్సవమూర్తులను కాపాడుకునేందుకు గ్రామాల మధ్య పోరాటం. వెరసి కర్రల సమరం. పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా.. ఇది మా సంప్రదాయం అంటూ అక్కడి గ్రామాల ప్రజలు ఏళ్లుగా ఈ పోరాటం చేస్తూనే ఉన్నారు. దేవతామూర్తులను కాపాడుకోవడానికి కర్రలతో కొట్టుకుంటూనే ఉన్నారు. ఈ ఏడాది కూడా కర్నూలు (Kurnool) జిల్లా హొళగుంద మండలం దేవరగట్టులో (Devaragattu) బన్నీ ఉత్సవం కొనసాగింది. సుమారు 800 అడుగుల ఎత్తైన కొండపై వెలసిన మాళ మల్లేశ్వర స్వామి దసరా బన్నీ ఉత్సవాన్ని ఈ ఏడాది కూడా సంప్రదాయం ప్రకారం నిర్వహించారు. ఆదివారం తెల్లవారుజామున జరిగిన కర్రల సమరంలో హింస చెలరేగింది. ఇరువర్గాల ప్రజలు కర్రలతో కొట్టుకోవడంతో దాదాపు 70 మంది గాయలపాలయ్యారు. వీరిని సమీపంలోని ఆదోని, బళ్లారి ఆస్పత్రులకు తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
హింసకు తావు లేకుండా బన్నీ ఉత్సవం నిర్వహించుకునేందుకు జిల్లా యంత్రాంగం, పోలీసులు ఏర్పాట్లు చేసినా ఎలాంటి సత్ఫలితాన్నివ్వలేదు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 800 మంది పోలీసులు మోహరించారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా ఉంచారు. అయినా, కర్రల సమరంలో హింస చెలరేగింది. పదుల సంఖ్యలో ప్రజలు గాయాలపాలయ్యారు.
అసలేంటీ బన్నీ ఉత్సవం.?
ప్రతి ఏటా దసరా సందర్భంగా దేవరగట్టులో ఈ బన్నీ ఉత్సవం నిర్వహిస్తారు. కొండపై ఉన్న దేవతామూర్తులు మాళ మల్లేశ్వర స్వామికి శనివారం అర్ధరాత్రి 12 గంటలకు కల్యాణం నిర్వహించారు. అనంతరం కొండ పరిసర ప్రాంతాల్లో పాదాలగట్టు, రక్షపడ, శమీవృక్షం, ఎదురుబసవన్న గుడి మీదుగా దివిటీల వెలుతురులో విగ్రహాలు ఊరేగించారు. ఈ ఉత్సవ విగ్రహాలను దక్కించుకునేందుకు 5 గ్రామాల ప్రజలు ఓ వర్గంగా.. మూడు గ్రామాల ప్రజలు మరో వర్గంగా ఏర్పడి కర్రలతో సమరానికి దిగుతారు. ఉత్సవ మూర్తులను కాపాడుకోవడానికి నెరణికి, నెరణికితండా, కొత్తపేట గ్రామాల భక్తులు ఓవైపున.. అరికెర, అరికెరతండా, సుళువాయి, ఎల్లార్తి, కురుకుంద, బిలేహాల్, విరుపాపురం తదితర గ్రామాల ప్రజలు మరోవైపున కర్రలతో తలపడ్డారు. ఈ నేపథ్యంలో గాయాలపాలైనా కొందరు లెక్కచేయరు. ఈ కర్రల సమరాన్ని వీక్షించేందుకు సమీప ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు.
సమరంలో గాయాలపాలైన వారికి చికిత్స అందించేందుకు వైద్య శిబిరాలు నిర్వహిస్తారు. పరిస్థితి విషమంగా ఉంటే పట్టణంలో చేరుస్తారు. కొందరు చిన్న గాయాలపాలైన వారు పసుపు రాసుకుని వెళ్లిపోతారు.
ఇదీ చరిత్ర
త్రేతాయుగంలో దేవరగట్టు కొండల్లో లోక కల్యాణార్థం మునులు యజ్ఞ యాగాలు నిర్వహించేవారు. వాటిని మణి, మల్లాసురులనే రాక్షసులు భగ్నం చేసేవారు. దీంతో వారి బారి నుంచి రక్షించాలని మునులు శివపార్వతులను వేడుకోగా.. ఆది దంపతులు మాళ, మల్లేశ్వర స్వాములుగా అవతరించారు. రాక్షసులతో యుద్ధం ప్రారంభం కాగా.. శివుని చేతిలో మరణం భాగ్యమనుకున్న రాక్షసులు విజయదశమి రోజు చావుకి సిద్ధమయ్యారు. అయితే, తమకు ఏటా నరబలి ఇవ్వాలని కోరుకున్నారట. అది సాధ్యం కాదని.. విజయదశమి రోజున గొరవయ్య తొడ నుంచి పిడెకెడు రక్తాన్ని నైవేద్యంగా సమర్పిస్తారని స్వామి వారికి అభయమిచ్చాడు. అప్పటి నుంచి ప్రతి ఏటా దసరా రోజున ఈ జైత్రయాత్ర జరపడం ఆనవాయితీ అయ్యింది.