Ex MLA Rapaka Varaprasad Will Resign To Ysrcp: వైసీపీని వీడేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు కోనసీమ జిల్లా (Konaseema District) రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు (Rapaka Varaprasad Rao) తెలిపారు. ఆ పార్టీలో కొనసాగలేనని స్పష్టం చేశారు. కత్తిమండలోని తన నివాసంలో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. పార్టీ కోసం కష్టపడిన తనను వైసీపీ అవమానించిందని.. రాజోలులో ఎంత కష్టపడి పనిచేసినా తనకు టిక్కెట్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 'పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాకు టికెట్ ఇవ్వకుండా మోసం చేశారు. జగన్మోహన్ రెడ్డిని, నన్ను వ్యక్తిగతంగా దూషించిన వ్యక్తికి టికెట్ ఇచ్చి నన్ను అవమానించారు. వైసీపీ వాళ్లు పార్టీ మీటింగ్‌కు రమ్మని పిలిచినా నేను రాను అని చెప్పేశాను. ఇష్టం లేకపోయినా.. ఓడిపోతానని తెలిసినా పెద్దల సలహా మేరకు ఎంపీగా పోటీ చేశా. త్వరలో మరో పార్టీలో చేరుతా. అభిమానులు, శ్రేయోభిలాషులతో చర్చించి భవిష్యత్తు నిర్ణయం తీసుకుంటాను.' అని రాపాక స్పష్టం చేశారు.
జనసేనలో చేరుతారా.?
2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున రాజులులో పోటీ చేసి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా రాపాక నిలిచారు. ఆ టైంలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సైతం పోటీ చేసిన రెండు చోట్ల (గాజువాక, భీమవరం) ఓడిపోయారు. రాపాక సమీప వైసీపీ అభ్యర్థి బొంతు రాజేశ్వరరావుపై 814 ఓట్ల తేడాతో గెలిచారు. అయితే గెలిచిన తర్వాత ఆయన అప్పటి అధికార వైసీపీతో సన్నిహితంగా మెలిగారు. జనసేనాని పవన్ తనకు అపాయింట్‌మెంట్ సరిగ్గా ఇవ్వడం లేదని.. తన గెలుపునకు స్థానికంగా తను చేసిన ఎలక్షనీరింగ్ కారణం అంటూ చెప్పేవారు. సొంత పార్టీపైనే విమర్శలు చేసి కొంతకాలానికి వైసీపీ గూటికి చేరారు. జనసేన పార్టీ బలపడే పార్టీ కాదని.. ఏదా గాలివాటంగా తాను ఒక్కడినే గెలిచానంటూ అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయంగా మారాయి.
అనంతరం 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి అమలాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి వైసీపీకి దూరంగా ఉంటున్న రాపాక ప్రస్తుతం మళ్లీ కూటమి వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఆదివారం ఏకంగా మలికిపురంలో జరిగిన జనసేన సమావేశానికి ఆయన హాజరు కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది. ప్రస్తుత రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌ను కలిసి కొన్ని కీలక విషయాలు చర్చించినట్లు సమాచారం.
అసలు రీజన్ ఇదే..
అయితే, తనతో రాపాక చర్చించడంపై రాజోలు ప్రస్తుత ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ స్పందించారు. ఇందులో రాజకీయ కోణం లేదని.. మలికిపురం కాలేజీలో పని చేస్తోన్న 25 మంది అధ్యాపకుల జీతాల విషయంలో చర్చించేందుకే రాపాక తనను కలిశారని చెప్పారు. అయితే, స్థానికంగా మాత్రం రాపాక జనసేనలో చేరేందుకు పావులు కదుపుతున్నారంటూ అక్కడ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. మరి రాపాక జనసేనలో తిరిగి చేరుతారా.?, ఆయన చేరికకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా.?. లేదా వేరే పార్టీ వైపు చూస్తున్నారా.? అనేది తెలియాలంటే కొద్దికాలం ఆగాల్సిందే.
Also Read: Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - రాగల 24 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, అధికారుల అలర్ట్