Heavy Rains In Andhrapradesh: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురవనున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు తిరోగమిస్తున్నాయని.. గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, అసోం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, మహారాష్ట్ర సహా ఉత్తర బంగాళాఖాతం నుంచి రుతుపవనాలు క్రమంగా వైదొలుగుతున్నాయని పేర్కొంది. మరో 2 రోజుల్లో నైరుతి రుతుపవనాలు బలహీనపడే పరిస్థితులున్నాయని తెలిపింది. ఇదే సమయంలో దక్షిణ భారతదేశ ద్వీపకల్పం మీదుగా తూర్పు, ఈశాన్య గాలులు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని.. వీటి ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాలతో పాటు మధ్య బంగాళాఖాతంలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంలో శనివారం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. ఈ నెల 14 నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని చెప్పింది.


ఇది మరో 48 గంటల్లో ఇది మరింతగా బలపడే సూచనలు ఉన్నాయని పేర్కొంది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు కదిలే అవకాశం ఉందని.. వీటి ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్నిచోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఈ నెల 17 వరకూ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది.


ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్


ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆదివారం అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లోని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు, వర్షాలతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని.. పోలీసులు, విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తంగా ఉండాలని హోం మంత్రి అనిత ఆదేశించారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, శ్రీ సత్యసాయి జిల్లాల కలెక్టర్లు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. సోమవారం నుంచి మత్స్యకారులు మూడు రోజులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. విపత్తుల నిర్వహణ సంస్థ అత్యవసర సహాయక చర్యల కోసం కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది. ఎక్కడైనా సమస్య ఉంటే టోల్ ఫ్రీ నెంబర్లు 1070, 112, 1800 425 0101 నెంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచించారు. వర్షం కురిసే సమయంలో చెట్ల కిందగానీ, హోర్డింగ్స్ కింద ఉండొద్దని, పాత ఇండ్లలోకి వెళ్లకూడదని ప్రజలకు సూచించారు. 


అటు, నెల్లూరు జిల్లాకు సైతం వానగండం పొంచి ఉందని.. అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఆనంద్ వెల్లడించారు. 0861 - 2331261, 7995576699, 1077 నెంబర్ల ద్వారా కంట్రోల్ రూంను సంప్రదించవచ్చని సూచించారు. 


తెలంగాణలోనూ..


అటు, తెలంగాణలోనూ కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో ఈదురుగాలులు వీచనున్నట్లు పేర్కొంది. కొన్ని జిల్లాల్లో గంటకు 30 - 40 కి.మీ వేగంతో కూడిన గాలులు వీస్తాయని వెల్లడించింది. 


Also Read: Rapaka Varaprasad: జనసేన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ - పార్టీలోకి రీఎంట్రీ ఇస్తారా?, అసలు నిజం ఏంటంటే?