Zaheerabad MP BB Patil joins BJP: జహీరాబాద్: బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇటీవల బీఆర్ఎస్ ఎంపీ పి. రాములు (MP P Ramulu) పార్టీని వీడి బీజేపీలో చేరడం తెలిసిందే. తాజాగా మరో ఎంపీ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ (BB Patil) పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు పంపించారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలో చేరారు. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగి ఎంపీగా గెలిచారు.
బీఆర్ఎస్‌ను వీడుతున్న నేతలు.. నిన్న రాములు, నేడు పాటిల్
లోక్సభ ఎన్నికల వేళ కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్కు వరుస షాకులు తగులుతున్నాయి. నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ (Nagarkurnool MP Ramulu) పి. రాములు బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. ఒక్కరోజు కూడా గడవకముందే మరో బీఆర్ఎస్ ఎంపీ పార్టీకి రాజీనామా చేశారు. ఢిల్లీకి వెళ్లిన జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి పాటిల్ ను బీజేపీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, తదితరులు ఉన్నారు. లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతుండగా ఇతర పార్టీల నేతలు బీజేపీలోకి క్యూ కడుతున్నారని తరుణ్ చుగ్ అన్నారు. దేశం మొత్తం మోదీ హవా కొనసాగుతోందని, త్వరలో బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతుందన్నారు. ఎన్డీఏ విధానాలు, మోదీ మార్క్ పాలనకు ఆకర్షితులై బీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరుతున్నారని చెప్పారు.
బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేరికలు..
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తరువాత ఆ పార్టీని వీడుతున్న నేతల సంఖ్య పెరుగుతోంది. కొన్ని రోజుల కిందట బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత కారు పార్టీకి గుడ్ బై చెప్పి.. కాంగ్రెస్పార్టీలో చేరారు. నిన్న నాగర్కర్నూల్ఎంపీ పోతుగంటి రాములు బీఆర్ఎస్ ను వీడారు. ఢిల్లీలో గురువారం బీజేపీలో చేరారు. వీరితో పాటు ఆయన కుమారుడు కల్వకుర్తి జడ్పీటీసీ భరత్ ప్రసాద్, డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్ రెడ్డి, వనపర్తి జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డితో కలిసి బీజేపీలో చేరారు. శుక్రవారం (మార్చి 1న) ఎంపీ బీబీ పాటిల్ తరుణ్ చుగ్ సమక్షంలో కమలం గూటికి చేరారు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న తరుణంలో కీలక నేతలు పార్టీని వీడటం బీఆర్ఎస్ కు పెద్ద దెబ్బ అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో 17కి 17 ఎంపీ స్థానాలు బీజేపీ గెలుస్తుందని తెలంగాణ నేతలు దీమా వ్యక్తం చేస్తున్నారు.
Also Read: ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదం కేసు - టిప్పర్ గుర్తించిన పోలీసులు, కొనసాగుతోన్న దర్యాప్తు