Magunta Raghav approver : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ సీబీఐ కేసులో అప్రూవర్ గా మారారు. ఈడీ కేసులో ఇప్పటికే మాగుంట రాఘవ అప్రూవర్ గా మారగా తాజాగా సీబీఐ కేసులోనూ అప్రూవర్ గా మారడానికి రాఘవ చేసుకున్న దరఖాస్తును తాజాగా రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలకంగా వ్యవహరించిన దినేశ్ అరోరా, శరత్ చంద్రారెడ్డి ఇప్పటికే అప్రూవర్లుగా మారగా తాజాగా మాగుంట రాఘవ సైతం అఫ్రూవర్ గా మారడంతో ఈ కేసుపై మరింత ఉత్కంఠ పెరుగుతోంది.   ఈ కేసులో ఇటీవలే కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో రాఘవులు అప్రూవర్ గా మారడం సంచలనంగా మారింది.


డిల్లీ ఈ కుంభకోణంలో మాగుంట పాత్ర ఉన్నట్లు ఇప్పటికే దాఖలు చేసిన చార్జిషీట్లు, పలువురి రిమాండ్‌ అప్లికేషన్లలో ఈడీ పేర్కొన్న విషయం తెలిసిందే. ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) నేతలకు రూ.100 కోట్ల మేర సౌత్‌ గ్రూపు ముడుపులు చెల్లించినట్లు ఈడీ ఆరోపిస్తోంది. ఈ సౌత్‌ గ్రూపులో మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన కుమారుడు రాఘవ్‌ మాగుంట, కవిత, అరబిందో ఫార్మా సంస్థ డైరెక్టర్‌ శరత్‌చంద్రారెడ్డి భాగస్వాములుగా ఉన్నారని చెబుతోంది. సమీర్‌ మహేంద్రుకు చెందిన ఇండోస్పిరిట్స్‌ కంపెనీలో రాఘవ్‌కు 32.5 శాతం వాటాలు ఉన్నాయని ఈడీ గుర్తించింది. మద్యం విధానం రూపకల్పనలో భాగంగా జరిగిన పలు సమావేశాల్లో మాగుంట శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నట్లు ఆధారాలు సేకరించింది.


ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో కూడా సమావేశాలు జరిగాయని, వాటికి అరుణ్‌ పిళ్లై, కవిత మాజీ ఆడిటర్‌ బుచ్చిబాబు హాజరైనట్లు పేర్కొంది. ఆయన నివాసంలో ఈడీ, సీబీఐ సోదాలు కూడా నిర్వహించాయి. ఆయా హోటళ్లలో జరిగిన సమావేశాలు, రూపకల్పనలో భాగస్వామ్యం, సౌత్‌ గ్రూపు వ్యవహారాలు, ఇతర నిందితులతో సంబంధాలు, ముడుపుల చెల్లింపు, నగదు లావాదేవీలపై ఈడీ ప్రశ్నించింది.  గతంలో  చాలా కాలం పాటు ఈడీ కేసులో జైల్లో ఉన్నారు మాగుంట రాఘవ్ రెడ్డి.


మాగుంట శ్రీనివాసులరెడ్డికి వైఎస్ జగన్ టిక్కెట్ నిరాకరించడం.. పార్టీ వ్యవహారాల్లో పట్టించుకోకపోవడంతో  ఆయన ఇటీవల వైసీపీకి రాజీనామా చేశారు. టీడీపీలో చేరే అవకాశం ఉంది. మాగుంట రాఘవరెడ్డి ఈ సారి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తారని ఆయన చెబుతున్నారు. అయితే ఇంత వరకూ చంద్రబాబునాయుడ్ని కలవలేదు. గతంలో కాంగ్రెస్ లో ఉండేవారు.. తర్వాత టీడీపీలో చేరారు.  ఓ సారి టీడీపీ నుంచి  పోటీ చేసి ఓడిపోయారు . తర్వాత వైసీపీలో చేరి ఎంపీ అయ్యారు. మాగుంట కుటుంబం చాలా కాలం రాజకీయాల్లో ఉన్నా.. వారిపై ఎప్పుడూ స్కాం ఆరోపణలు రాలేదు. కానీ ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు మాత్రం మెడకు చుట్టుకుంది. మాగుంట కుటుంబానికి పెద్ద ఎత్తున మద్యం కంపెనీలు ఉన్నాయి.