Lok Sabha Polls 2024: లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ రంగం సిద్ధం చేసుకుంది. టార్గెట్ 370 ని సాధించేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది. అందుకే...అభ్యర్థుల ఎంపిక నుంచే జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ వ్యవస్థనే తయారు చేసుకుంది. ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకునేందుకు ఓ టీమ్‌ని ఏర్పాటు చేసింది. అంతే కాదు. అంతర్గతంగా ఎన్నో చర్చలు జరిపింది. ఎన్నో లెక్కలు వేసుకుంది. వీటితో పాటు ఉన్నత స్థాయిలో సమావేశాలు నిర్వహించింది. అప్పుడు కానీ అభ్యర్థులను ఎంపిక చేయలేదు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫిబ్రవరి 29న రాత్రి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాని ఫైనలైజ్ చేయడంపై చర్చించారు. అయితే..అంతకు ముందు క్షేత్రస్థాయిలో నుంచి ఒక్కో అభ్యర్థి గురించి ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంది బీజేపీ. ఇందుకు Namo Appని వినియోగించుకుంది. స్థానిక ఎంపీ పని తీరు ఎలా ఉందో చెప్పాలంటూ ఒపీనియన్ పోల్ పెట్టింది. అంతే కాదు. ఒక్కో ప్రాంతంలో ప్రజలకు ఎక్కువగా నచ్చిన ముగ్గురు నేతల పేర్లను సేకరించింది. స్థానిక ప్రజలకు ఆయా నేతలు ఏ మేరకు అందుబాటులో ఉంటున్నారు..? వాళ్ల పని తీరు ఎలా ఉంది..? అనే కోణాల్లో అభిప్రాయాలు సేకరించింది. దాదాపు రెండేళ్లుగా ఈ ఫీడ్‌బ్యాక్‌ ప్రక్రియని కొనసాగిస్తూనే ఉంది బీజేపీ. కేవలం ఈ ఫీడ్‌బ్యాక్‌పైనే ఆధారపడకుండా కొన్ని సర్వే ఏజెన్సీలనూ రంగంలోకి దింపింది. ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో సర్వే చేయించింది. 


కొంత మంది మంత్రులకూ ఈ పని పురమాయించింది హైకమాండ్. పార్లమెంట్ నియోజకవర్గాలకు వెళ్లి అక్కడి ఎంపీలకు ఏ మేర చరిష్మా ఉందో తెలుసుకోవాలని తేల్చి చెప్పింది. ఇలా సర్వే ఏజెన్సీలు,మంత్రులు, ప్రజలు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా అభ్యర్థుల జాబితాని సిద్ధం చేసుకుంది. ఎంపీల పని తీరు అత్తెసరుగా ఉందని తెలిస్తే వాళ్లకి మరోసారి టికెట్‌ ఇవ్వకూడదని నిర్ణయించుకుంది. ఈ విషయంలో ఎలాంటి మొహమాటాలు పెట్టుకోడవం లేదని తెలుస్తోంది. దాదాపు 60-70 మంది సిట్టింగ్ ఎంపీలకు టికెట్‌ దక్కకపోవచ్చని సమాచారం. వాళ్ల స్థానంలో కొత్త వారికి అవకాశాలిస్తారని తెలుస్తోంది. OBC వర్గానికి చెందిన వాళ్లకే ఎక్కువగా టికెట్‌లు ఇవ్వాలని నిర్ణయించుకుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ 85 మంది OBCలకే ఎంపీ టికెట్‌లు ఇచ్చింది. ఈ సారీ అదే ఫార్ములాని అనుసరించనుంది. రాత్రి 11 గంటల వరకూ మేధోమథనం చేసిన హైకమాండ్...2019లో సాధించిన స్థానాల కన్నా కచ్చితంగా ఎక్కువగా గెలుచుకోవాలనే లక్ష్యంగా పెట్టుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ 370కి తక్కువ కాకుండా చూసుకుంటోంది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ వరుస పెట్టి పలు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన చేస్తున్నారు. పదేళ్లలో ఎంతో చేశామని ప్రచారం మొదలు పెట్టారు. అటు అమిత్ షా కూడా ప్రచారానికి అంతా సిద్ధం చేస్తున్నారు. 


Also Read: BJP Parliament Candidate List : నేడే వంద మంది బీజేపీ పార్లమెంట్ సభ్యుల తొలి జాబితా- తెలంగాణ నుంచి 9 పేర్లు ఉండే అవకాశం!