ప్రతి వారం వైఎస్ షర్మిల ఒకరోజు నిరుద్యోగ నిరాహార దీక్షలో భాగంగా మంగళవారం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం షర్మిల మహబూబ్‌నగర్‌లోని పాలమూరు యూనివర్సిటీ ఎదుట ఒకరోజు నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. ఆ సందర్భంగా నగరంలోని తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అయితే, ఆ సమయంలో అప్పటికే కురిసిన వర్షాల కారణంగా రోడ్డంతా బురదగా ఉంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు షర్మిల రాకకు ముందే వైఎస్ఆర్ విగ్రహానికి పూల మాలలు వేసేందుకు ఏర్పాట్లు చేశారు.
అయితే, ఆ విగ్రహం ముందు రోడ్డుపై ఉన్న ప్రాంతమంతా బురదగా ఉంది. ఆ విషయం గమనించిన కార్యకర్తలు షర్మిలకు మట్టి అంటుకోకుండా ఉండేందుకు పక్కనే మొక్కల కొమ్మలను కత్తిరించి బురదపై వేసేశారు. ఆ తర్వాత షర్మిల.. బురదపై వేసిన ఆ కొమ్మలపై నుంచి నడుచుకుంటూ వెళ్లి తన తండ్రి విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. ఆ ప్రాంతమంతా జనం గుమిగూడడంతో అందరికీ అభివాదం చేశారు. అనంతరం నిరుద్యోగ నిరాహార దీక్ష స్థలానికి వెళ్లారు.
అయితే, వైఎస్ షర్మిల కోసం మొక్కల కొమ్మలు విరిచి.. బురదగా ఉన్న దారిని సాఫీగా చేయడంపై విమర్శలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
కల్వకుంట్ల చేతిలో రాష్ట్రం బందీ: షర్మిల
నిరుద్యోగ నిరాహార దీక్ష సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. అఫ్గానిస్తాన్ తాలిబన్ల చేతిలో బందీ అయినట్లుగా.. తెలంగాణ రాష్ట్రం కల్వకుంట్ల కుటుంబం చేతిలో చిక్కుకుందని ఘాటుగా విమర్శించారు. రాష్ట్రంలో కేసీఆర్ ఒక నియంతలా మారారని, ఏడేళ్ల కాలంలో రాష్ట్రంలో నిరుద్యోగం తారస్థాయికి చేరిందని విమర్శించారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక.. రాష్ట్రంలో ఇప్పటిదాకా 7 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదని అన్నారు. పాలమూరు వర్సిటీలో 13 ప్రొఫెసర్ పోస్టులకు అన్నీ ఖాళీగా ఉన్నాయని విమర్శించారు. సీఎం గొర్రెలు, బర్రెలు పెంచుకోవాలని చెబుతుంటే మరో మంత్రి హమాలీ పనులు చేసుకోవాలని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన హయాంలో వ్యవసాయాన్ని పండుగలా చేశారని గుర్తు చేశారు.
Also Read: Tamilisai Soundararajan: కేసీఆర్‌తో గవర్నర్‌కు విభేదాలున్నాయా? తమిళిసై క్లారిటీ, ఆ పుస్తకం విడుదల