Yellandu MLA Koram Kanakaiah: భద్రాద్రి కొత్తగూడెం జల్లా ఇల్లందు మున్సిపల్‌ ఆఫీస్‌ వద్ద తీవ్రమైన ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ చైర్మన్‌ దుమ్మాలపాటి వెంకటేశ్వరారావుపై అవిశ్వాస తీర్మానం పెట్టడం కోసం పాలకవర్గం ప్రత్యేకంగా సమావేశం కాగా.. దానిపై అనుకూలంగా ఓటు వేయడానికి 17 మంది కౌన్సిలర్లు అక్కడికి చేరుకున్నారు. మరో ఇద్దరు కౌన్సిలర్లు మద్దతు తెలిపితే అవిశ్వాసం వీగిపోనుంది. ఈ క్రమంలో కౌన్సిలర్లను ఎమ్మెల్యే కిడ్నాప్ చేయించారని ఆరోపణలు వస్తున్నాయి. మున్సిపల్ ఛైర్మన్ పై బీఆర్ఎస్ పెట్టిన అవిశ్వాస తీర్మానం జరగకుండా ఎమ్మెల్యే కనకయ్య  దగ్గరుండి అడ్డుకున్నారని చెబుతున్నారు.


కౌన్సిలర్‌ నాగేశ్వరరావును కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోరం కనకయ్య బలవంతంగా తీసుకెళ్లగా, సీపీఐ కౌన్సిలర్‌ను ఆ పార్టీ నాయులు తమవెంట తీసుకెళ్లారు. మున్సిపల్‌ కార్యాలయానికి బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రక్తత ఏర్పడింది. ఈ క్రమంలో అడ్డువచ్చిన మాజీ ఎమ్మెల్యే హరి ప్రియ నాయక్ ను పక్కకు నెట్టి స్థానిక రౌడీల సాయంతో కొక్కు నాగేశ్వరావు కిడ్నాప్ చేయించినట్లుగా విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ పోలీసులు చోద్యం చూస్తు్న్నట్లుగా తెలుస్తోంది.


సంఘ విద్రోహ శక్తుల నుంచి తమకు ప్రమాదం పొంచి ఉందని, తగిన భద్రత కల్పించాలని హైకోర్టు నుంచి బీఆర్ఎస్ కౌన్సిలర్లు తెచ్చుకున్న ఉత్తర్వులను పోలీసులు బేఖాతరు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. మొత్తానికి 144 సెక్షన్ విధించి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్న ఎస్పీ ఆదేశాలను సైతం పోలీసులు పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. చంపుతామని, డెడ్ బాడీ కూడా దొరక్కుండా చేస్తామని కాంగ్రెస్ నాయకులు బెదిరించారని బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.