Competition for Nellimerla seat in tdp and janasena: సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో ప్రధాన పార్టీలు అభ్యర్థుల ప్రకటనకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే వైసీపీ ఆరు విడతల్లో అభ్యర్థులను ప్రకటించింది. టీడీపీ, జనసేన కూటమి కూడా అభ్యర్థులను ప్రకటించే దిశగా చర్యలను వేగవంతం చేస్తోంది. ఆదివారం టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రెండు విడతలుగా చర్చలు జరిపి కొన్ని సీట్లపై సర్ధుబాటుకు వచ్చారు. ఇంకా, కొన్ని సీట్లపై చిక్కుముడి నెలకొంది. చిక్కుముడి ఉన్న సీట్ల జాబితాలో విజయనగరం జిల్లా నెల్లిమర్ల సీటు కూడా ఉన్నట్టు చెబుతున్నారు. ఇక్కడ ఇరు పార్టీలకు చెందిన అభ్యర్థులు సీటును ఆశిస్తున్నారు. ఇద్దరు ముఖ్యమైన అభ్యర్థులు సీటు సాధించడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎవరికి సీటు ఇస్తారన్న దానిపైనా ఆసక్తి నెలకొంది. తమకే వస్తుందంటూ ఇరువురు నేతలు పార్టీ కేడర్‌కు చెబుతుండడంతో.. ఇరు పార్టీలకు చెందిన శ్రేణులు కూడా ఏం జరుగుతుందో అన్న ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. 


టీడీపీ నుంచి కర్రోతు బంగార్రాజు


తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఇక్కడ ప్రస్తుతం కర్రోతు బంగార్రాజు వ్యవహరిస్తున్నారు. ఏడాది కిందట పార్టీ ఇన్‌చార్జ్‌ బాధ్యతలను అప్పగించింది. అప్పటి నుంచి జోరుగా పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు. లోకేష్‌ పాదయాత్ర ముగింపు సభ కూడా నెల్లిమర్ల నియోజకవర్గ పరిధిలోని పోలిపల్లి గ్రామంలో నిర్వహించారు. ఈ సభను విజయవంతం చేయడంలో స్థానికంగా తన వంతు పాత్రను కర్రోతు బంగార్రాజు నిర్వర్తించారని చెబుతుంటారు. ముఖ్యంగా టీడీపీలో యువనేత నారా లోకేష్‌ ఆశీస్సులు బంగార్రాజుకు పుష్కలంగా ఉన్నట్టు చెబుతున్నారు. కానీ, బంగార్రాజు టికెట్‌ ఇవ్వడాన్ని సొంత పార్టీలోని నేతలే కొందరు వ్యతిరేకిస్తున్నట్టు చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి నాయుడు ఇక్కడి నుంచి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు. గడిచిన నాలుగు దశబ్ధాలు నుంచి రాజకీయాలు సాగిస్తున్న తనకు మరోసారి అవకాశం కల్పించాలని, వారసులు సిద్ధంగా ఉన్నారని ఆయన చెబుతూ వస్తున్నారు. కానీ, పార్టీ ఆయనకు ఎంత వరకకు అవకాశాన్ని కల్పిస్తుందో తెలియడం లేదు. కర్రోతు బంగార్రాజు ఆర్థికంగా బలంగా ఉండడంతోపాటు కేడర్‌ను క్షేత్రస్థాయిలో కలుపుకుంటూ వెళతారన్న పేరుంది. అధిష్టానం ఎంత వరకు బంగార్రాజుకు సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మిత్రపక్షం నుంచి పోటీ ఉండడం, స్వపక్షంలో కూడా కొందరు వ్యతిరేకిస్తుండడంతో బంగార్రాజు కొంత ఇబ్బందిగా మారుతున్నట్టు చెబుతున్నారు. 


జనసేన నుంచి లోకం మాధవి యత్నం


గడిచిన కొన్నాళ్ల నుంచి జనసేన పార్టీ నుంచి ఇక్కడ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళుతున్నారు ఆ పార్టీ నేత లోకం మాధవి. మిరాకిల్‌ సంస్థ అధినేతగా ఈమెకు స్థానికంగానే కాకుండా ఉత్తరాంధ్రలోనే మంచి పేరుంది. ఇప్పటి వరకు పార్టీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలను ఆమె చేపట్టారు. యువగళం ముగింపు సభకు భారీగానే కేడర్‌ను తరలించారు. జనసేన కోరుకుంటున్న సీట్లలో ఇది కూడా ఉందని చెబుతున్నారు. ఈమె భర్త పవన్‌ కల్యాణ్‌కు అత్యంత ఆత్మీయ వ్యక్తి కావడంతో తప్పనిసరిగా సీటు మాధవికి వస్తుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆమె కూడా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ముందుకు వెళుతున్నారు. తనకు టికెట్‌ ఇస్తే గెలిచి వస్తానంటూ ఆమె ఇప్పటికే పవన్‌ కల్యాణ్‌కు స్పష్టం చేశారు.


గడిచిన ఐదేళ్ల నుంచి విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తనకు ఇవ్వకపోతే.. కేడర్‌ నిరుత్సాహంలో కూరుకుపోతుందని ఆమె అధిష్టానానికి చెప్పినట్టు చెబుతున్నారు. చూడాలి మరి ఇరు పార్టీల అగ్ర నాయకులు ఈ సీటుపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో.