Ganja Smuggling on Scooty: స్కూటీపై ఏకంగా 600 కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించి గంజాయి సరఫరా చేస్తున్న కిలాడి లేడినీ అదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం మాన్కాపూర్ గ్రామం వద్ద మాటువేసి పట్టుకున్నారు పోలీసులు.. గురువారం గుడిహత్నూర్ పోలిస్ స్టేషన్ లో ఇచ్చోడ సీఐ భీమేష్, ఎస్సై ఇమ్రాన్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. మహరాష్ట్రలోని వాసింకు చెందిన మోహిని ఠాక్రే (34) గత కొన్ని సంవత్సరాల నుండి ఒరిస్సా లోని మల్కన్ గిరి ప్రాంతం నుండి మహరాష్ట్రలోని వాసిం జిల్లాకు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఆంటి నార్కోటిక్ బ్యూరో సమాచారం మేరకు మోహిని ఠాక్రే ను స్కూటీలో పది లక్షల విలువ గల 28 కిలోల గంజాయితో సహా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు పోలిసులు.. పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. ఒరిస్సా నుండి మహరాష్ట్రలోని వాసింకు 600 కిలోమీటర్లకు పైగా దూరం స్కూటిపై ప్రయాణించి గంజాయి సరఫరా చేస్తున్నట్లు, గత నాలుగు సంవత్సరాల నుంచి నెలకు మూడు సార్లు స్కూటిపై గంజాయి సరఫరా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
విజయవంతంగా సరఫరా చేసిన ప్రతిసారి లక్ష రూపాయల పారితోషికం మహిళకు దొరికేదని పోలీసులు తెలిపారు. తొలుత ఈమె గంజాయి తోటలలో కూలీగా పనిచేసేదని.. తర్వాత క్రమంగా మోహిని ఠాక్రే స్మగ్లర్ గా ఎదిగిందని అన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపుతున్నట్లు ఇచ్చోడ సీఐ భీమేష్ తెలిపారు. గంజాయి ఇతర మత్తు పదార్థాలను ఎవరైనా స్మగ్లింగ్ కు పాల్పడితే పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు.