Nara Lokesh did not attend the Tadepalligudem meeting : తెలుగుదేశం, జనసేన పార్టీలు ఉమ్మడిగా మోగించిన ఎన్నికల ప్రచారభేరి సభ తాడేపల్లిగూడెంలో జరిగింది. భారీగా జన సమీకరణ చేసి సత్తా చాటారు. ఒక్క స్టేజ్ మీదనే.. ఐదు వందల మంది ఇరు పార్టీల నేతలు ఉండేలా చూసుకున్నారు. అందరూ వచ్చారు కానీ.. నారా లోకేష్ మాత్రం కనిపించలేదు. అసలు సభకు నారా లోకేష్ రాలేదు. ఎందుకు రాలేదన్నది సభ జరుగుతున్నప్పుడు పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు కానీ.. ఇప్పుడు మాత్రం లోకేష్ ఎందుకు రాలేదన్నదానిపై రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
కావాలనే లోకేష్ సభకు హాజరు కాలేదంటున్న సన్నిహితులు
నారా లోకేష్ ఉమ్మడి ప్రచారభేరి సభకు కావాలనే దూరంగా ఉన్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అక్కడ చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రసంగాలు మాత్రమే హైలెట్ కావాలని .. తాను మాట్లాడితే బాగుండదని లోకేష్ అనుకున్నారని అంటున్నారు. పైగా అది ఉమ్మడి ప్రచార భేరీ సభ. సభా ఏర్పాట్లను జనసేన పార్టీ తీసుకుంది. ఆ పార్టీ నేతలు సభ కోసం కష్టపడ్డారు. ఆ పార్టీ నేతలకే ప్రాధాన్యం ఇవ్వాలని టీడీపీ అనుకుంది. ఆ ప్రకారం.. చంద్రబాబు మాత్రమే ప్రధానంగా ప్రస్తావించారు. మిగిలిన వారిలో ఎక్కువగా జనసేన నేతలే ప్రసంగించారు. చంద్రబాబు, బాలకృష్ణ లాంటి వారు మినహా టీడీపీ నేతలు ఎవరూ పెద్దగా ప్రసంగించలేదని గుర్తు చేస్తున్నారు.
మంగళగిరిలో విస్తృత పర్యటనలు
మరో వైపు నారా లోకేష్ మంగళగిరిలో తీరిక లేకుండా కార్యక్రమాల్లో ఉన్నారు. రోజూ పలు రంగాల ప్రముఖుల్ని పార్టీలో చేర్చుకుంటున్నారు. బుధవారం రోజున కూడా.. పెద్ద ఎత్తున చేరికలు.. వివిధ కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పటికే పాదయాత్ర కోసం దాదాపుగా ఏడాది పాటు నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. మళ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చే ముందు నుంచి.. ప్రచార బాధ్యతల్ని రాష్ట్రం మొత్తం నిర్వర్తించాల్సి ఉంది. అందుకే నియోజకవర్గంలో సుడిగాలిలా పర్యటించాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు. లోకేష్.. మంగళఘరిలో రోజూ పదికిపైగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పార్టీ సీనియర్ నేతల ఇళ్లకే కాదు తటస్థుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పలకరిస్తున్నారు.
చంద్రబాబు, పవన్ మాత్రమే హైలెట్ కావాలనుకుంటున్న లోకేష్
ఈ ఎన్నికల్లో టీడీపీ పార్టీ కోసం పాదయాత్ర చేసినా.. నారా లోకేష్.. ఓ కార్యకర్తగానే తన కృషి ఉంటుందని..అంతకు మించి క్రెడిట్ తీసుకునేందుకు ఆసక్తిగా లేరని అంటున్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాత్రమే.. మొత్తంగా హైలెట్ అవుతారని.. అంటున్నారు. టీడీపీ కార్యక్రమాల్లో చంద్రబాబు తర్వాత లోకేష్ కనిపించినప్పటికీ.. ఉమ్మడి సభల్లో మాత్రం.. చంద్రబాబు మాత్రమే ప్రధానంగా ఉంటారని.. ఆ తర్వాత పవన్ కల్యాణ్ ఉంటారని అంటున్నారు.