తండ్రి పదవుల పందేరంలో అధికారులను ఏమార్చిన వనమా రాఘవ కట్టుకున్న అక్రమాల కోట ఇప్పుడిప్పుడే కూలుతోంది. రాఘవ అసలు బాగోతం ప్రపంచానికి తెలిసింది. అతనిపై వచ్చిన నేరారోపణలు ఎన్ని.. వాటిలో నిజమెంత అనే విషయంపై చర్చ సాగుతుంది. గతంలో వచ్చిన నేరారోపణలు పక్కన పెడితే ఇటీవల కాలంలో వచ్చిన నేరారోపణలపై అసలు ఎందుకు విచారణ సాగలేదన్నది అందరి డౌట్. రామకృష్ణ కేసులో ఆరోపణలు రావడంతో ఆరునెలల క్రితం జరిగిన సంఘటనపై స్పందించి హడావుడిగా ఏకంగా ఎమ్మెల్యే ఇంటికి నోటీసులు ఎందుకు అంటించారనే విషయంపై డిస్కషన్ నడుస్తోంది. రాఘవ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన మల్లిపెద్ది వెంకటేశ్వర్లు విషయం ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. వెంకటేశ్వర్లు సూసైడ్‌ నోట్‌లో రాఘవకు సహకరించిన కొందరు పోలీస్‌ అధికారుల పేర్లు రాయడం, వారిపై ఇప్పుడు విచారణ సాగుతుందా..? లేదా..? అనే విషయం ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. 
పోలీసుల సహకారంతోనే రాఘవ ఆగడాలా..?
మలిపెద్ది వెంకటేశ్వర్లు ఆత్మహత్య విషయంలో అతను రాసిన సూసైడ్‌ నోట్‌లో రాఘవకు సహకరించిన కొందరు పోలీస్‌ అధికారుల పేర్లు ప్రస్తావించారు. అప్పట్లో పాల్వంచ టౌన్‌ ఎస్సైగా పనిచేస్తున్న ప్రవీణ్, రూరల్‌ ఎస్సైగా పని చేస్తున్న సుమన్, సీఐ సత్యనారాయణ, డీఎస్పీతోపాటు కానిస్టేబుళ్లు లక్ష్మణ్, రఘురామరెడ్డి, హోంగార్డు రామకోటి పేర్లు ఉన్నాయి. తన సెటిల్‌మెంట్‌లు చేయడం కోసం పోలీసు అధికారులను సైతం వాడుకున్నాడనే విషయంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


మలిపెద్ది వెంకటేశ్వర్లు కేసులో అసలు ఏం జరిగింది..? ఎందుకు మలిపెద్ది వెంకటేశ్వర్లు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. ఈ కేసు విషయంలో పోలీసులకు సంబంధం ఏమిటనే విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి విచారణ సాగలేదు. తన భూమి సమస్య పరిష్కారం కోసం రాఘవను ఆశ్రయిస్తే తప్పుడు కేసులు పెట్టి జైలు పాలు చేశారన్నది మలిపెద్ది వెంకటేశ్వర్లు ఆరోపణ. రాఘవ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్టు సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు. ఇప్పటి వరకు ఆ కేసును పట్టించుకోని పోలీసులు ఇప్పుడు హడావుడి పడుతున్నారు. నోటీసులు జారీ చేసారు. అంటే రామకృష్ణ ఆత్మహత్య వెలుగులోకి రాకుంటే దీన్నికూడా రూపుమాపేసేవారని అనుమానం పడుతున్నారు స్థానిక ప్రజలు.  ఇప్పటికైనా రాఘవ నేర సామ్రాజ్య పునాదులు కదులుతున్నాయని అభిప్రాయపడుతున్నారు. 


అంతా తానై శాసించిన రాఘవ..
తన తండ్రి వనమా వెంకటేశ్వరరావు పదవిని అడ్డం పెట్టుకుని ఇన్ని రోజులు వనమా రాఘవేందరావు యువరాజుగా చలామణి అయ్యాడు. నియోజకవర్గంలో తాను చెప్పిందే వేదంగా ముందుకు సాగినట్లు తెలుస్తోంది. అటు అధికారులను బెదిరిస్తూ ఇటు ప్రజలను వేధిస్తూ మూడు దశాబ్దాల పాటు రాఘవ నేర సామ్రాజ్యాన్నే నిర్మించాడు. రాజకీయంగా తన బలాన్ని వాడుతూ ఎవరిని ప్రశ్నించకుండా చేస్తూ ముందుకు సాగినట్లు తెలుస్తోంది.


ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడి సూసైడ్‌ నోట్‌లో రాఘవతోపాటు పోలీస్‌ అధికారుల పేర్లను రాసినప్పటికీ విచారణ జరగపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో హడావుడిగా నోటీసులు జారీ చేయడం చూస్తే అధికార యంత్రాగాన్ని రాఘవ ఎంతగా వాడుకున్నాడో ఇట్టే అర్థమవుతుంది. ఏది ఏమైనప్పటికీ మలిపెద్ది వెంకటేశ్వర్లు ఆత్మహత్య విషయంలో పోలీసుల పేర్లు వచ్చినప్పటికీ వారిపై శాఖా పరమైన విచారణ సాగిందా..? లేక వదిలేశారా...? అన్నది  పోలీసు వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 


Also Read: వనమా రాఘవ అరెస్టు... హైదరాబాద్‌కు వస్తుండగా అదుపులోకి తీసుకున్న పోలీసులు


Also Read: Vanama Raghava: టీఆర్ఎస్ నుంచి వనమా రాఘవ సస్పెషన్... నాడే శిక్ష వేసి ఉంటే నేడు నాలుగు ప్రాణాలు దక్కేవి



Also Read: కొత్తగూడెం ఫ్యామిలీ సూసైడ్‌ కేసులో మరో ట్విస్టు.. తన భార్యను ఎమ్మెల్యే కుమారుడు రమ్మన్నాడని నాగ రామకృష్ణ సెల్ఫీ వీడియో 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి