Munugode Result Effect : మునుగోడు ఉపఎన్నికను తెలంగాణ రాజకీయ పార్టీలన్నీ సెమీ ఫైనల్స్‌గా భావించాయి. ఇక్కడ గెలిచే పార్టీకి ఫైనల్స్‌లో అడ్వాంటేజ్ ఉంటుందని నమ్మకంగా చెబుతూ వచ్చాయి. అందుకే శక్తివంచన లేకుండా ప్రయత్నించాయి. ఏడాది్ మాత్రమే పదవీ కాలం ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున ఖర్చు పెట్టడానికి .. పూర్తి సమయం వెచ్చించడానికి వెనుకాడలేదు. ఇప్పుడు ఫలితం వచ్చేసింది. మరి గెలిచిన పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుందా ? రెండు, మూడు స్థానాల్లో ఉన్న పార్టీలు ఆశలు వదిలేసుకోవాల్సిందేనా ? 


మునుగోడు గెలుపు ఆత్మవిశ్వాసం ఇస్తుంది తప్ప.. రాజకీయ ప్రయోజనం కల్పించదు !


రాజకీయాలు డైనమిక్‌గా ఉంటాయి. నెల రోజుల తర్వాత మునుగోడు ఉపఎన్నికలో గెలిచిన పార్టీ గురించి చెప్పుకోడం తగ్గిపోతుంది. అప్పటి రాజకీయాలు వేరుగా ఉంటాయి. ఎందుకంటే ఇది ఎన్నికల సంవత్సరం. మునుగోడులో గెలిచిన విషయాన్ని ఆరు నెలల తర్వాత ఎవరూ గుర్తుంచుకోరు. అందుకే ఈ ఫలితం వల్ల ఇప్పటికిప్పుడు విజేతకు వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. కానీ.. ప్రజలు తమ వైపే ఉన్నారన్న ఓ కాన్ఫిడెన్స్ ను మాత్రం ఈ విజయం ఇచ్చింది. అధికార వ్యతిరేకత ఎక్కువగా ఉంటుందన్న ఓ అభిప్రాయాన్ని ఈ ఫలితం పటాపంచలు చేస్తుంది. పక్క చూపులు చూసేవారిని కట్టడి చేయడానికి ఉపయోగపడుతుంది. 


ఉపఎన్నిక .. ఓ అంశంపై జరిగిన ఎన్నిక !


మునుగోడు ఉపఎన్నికకు ఎజెండా అంటూ లేదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎందుకు రాజీనామా చేశారో ఆయనకు మాత్రమే తెలుసు. ప్రజలకు తెలిదు. ప్రజలకు అవసరం లేదు కూడా. ఉపఎన్నిక ఎందుకొచ్చిందో వాళ్లు పట్టించుకోలేదు. కానీ రాజకీయ పార్టీలకు మాత్రం ఈ ఉపఎన్నికలో గెలవాలన్న ఎజెండా ఉంది. అందుకే ఇష్టారీతిన ఖర్చు పెట్టి ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రయత్నతించాయి. కానీ ప్రజలు మాత్రం ఇక్కడ ఓటింగ్ ఎజెండా ఏమిటి అన్నది డిసైడ్ చేసుకోలేదు. తమకు ఎక్కువ ప్రయోజనం కల్పించిన వారికో.. లేకపోతే మరో కారణంతోనే ఓటేశారు కానీ.. ఎమ్మెల్యేలను లేదా.. ప్రభుత్వాన్ని ఎన్నుకోవడాని కాదు. 


అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు సీఎం కావాలన్నది ఎజెండా.. ప్రజలు ఓట్లేసేదీ ఆ కోణంలోనే !


అసెంబ్లీ ఎన్నికలు జరిగితే... ప్రచారాంశాలు .. ఎజెండా పూర్తిగా మారిపోతాయి. ఉపఎన్నికల్లో ప్రజలు ఓట్లేసేది ప్రభుత్వాలను మార్చడానికి కాదు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఓట్లేసేది.. ప్రభుత్వాలను మార్చడానికి లేదా.. కొనసాగించడానికి. ఈ ఎజెండా ప్రకారం ప్రజలు ఓట్లేస్తారు. అందుకే ఉపఎన్నికలతో పోలిస్తే.. అసెంబ్లీ ఎన్నికల్లో భిన్నమైన ఫలితాలు వస్తాయి. 2017లో నంద్యాలలో ఉపఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాదించింది. కానీ సాధారణ ఎన్నికలకు వచ్చే సరికి ఆ పార్టీ ఘోర పరాజయం పాలైంది. నంద్యాలలో కూడా ఓడిపోయింది. అక్కడ ప్రజలు ఉపఎన్నికల్లో ఆలోచించిన విధానం వేరు..  అసెంబ్లీ ఎన్నికల సమయానికి వారి ఓటింగ్ ప్రయారిటీ మారిపోయింది. ప్రభుత్వాన్ని మార్చాలనుకున్నారు. ఇదే కోణంలో ఎన్నికలు జరుగుతాయి. 


మునుగోడు ప్రభావం ఫైనల్స్‌పై ఏమీ  ఉండదు !


రాజకీయ పార్టీలు ఉపఎన్నికల్లో గెలిచినా గెలవకపోయినా.. ఎలాంటి ప్రభావం ఉండదు. ఫైనల్స్‌లో మాత్రం ప్రజలు ఓట్లేసే విధానం వేరు. అయితే ఉపఎన్నికల్లో వచ్చే ఓట్ల శాతాలు మరీ తక్కువగా ఉంటే.. ఆ పార్టీ మరీ చిక్కిపోయిందన్న అభిప్రాయం ఏర్పడుతుంది. అది ఆయా పార్టీలకు మంచిది కాదు.