టాలీవుడ్ లో ఉన్న సీనియర్ ప్రొడ్యూసర్స్ లో శివలెంక కృష్ణప్రసాద్ ఒకరు. తన కెరీర్ లో ఎన్నో హిట్టు సినిమాలు తీశారాయన. అప్పట్లోనే టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో 'ఆదిత్య 369' అనే భారీ సినిమాను తీసి సూపర్ హిట్ అందుకున్నారు శివలెంక కృష్ణప్రసాద్. ఇప్పుడు ఆయన నిర్మాతగా తెరకెక్కించిన సినిమా 'యశోద'. ఇందులో సమంత లీడ్ రోల్ పోషించారు. నవంబర్ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రబృందం ప్రమోషన్స్ ముమ్మరం చేసింది. 


ప్రస్తుతం సమంత అనారోగ్యంతో ఇబ్బంది పడుతుందందాతో ఆమె ప్రమోషన్స్ లో పాల్గొనలేకపోతున్నారు. అయినప్పటికీ.. ఒక వీడియో ఇంటర్వ్యూ ఇవ్వాలని భావిస్తున్నారట. మరోపక్క టీమ్ మాత్రం తమవంతు ప్రమోషన్స్ చేస్తుంది. ఇప్పటికే వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ లాంటి నటులు సినిమాకి సంబంధించి ఇంటర్వ్యూలు ఇచ్చారు. తాజాగా నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. 


ఇందులో కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారాయన. ఇద్దరు యంగ్ డైరెక్టర్లు హరి, హరీష్ చెన్నైలో తనను కలిసి కథ చెప్పారని.. ఆ సమయంలో కథలో చిన్న చిన్న మార్పులు చేయమని అడిగానని.. ఆ విధంగా ప్రాజెక్ట్ ఓకే అయిందని చెప్పారు. నిజానికి మొదట ఈ సినిమాను రూ.2.5 నుంచి రూ.3 కోట్ల బడ్జెట్ లో తీయాలనుకున్నామని.. కానీ ఎప్పుడైతే సమంతను ఆన్ బోర్డ్ చేశామో సినిమా రేంజ్ పెరిగిపోయిందని అన్నారు. 


లార్జ్ స్కేల్ లో సినిమాను నిర్మించాలని నిర్ణయించుకున్నట్లు.. మొత్తం రూ.40 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. సమంత తనకు పెద్ద కూతురు లాంటిదని.. తన వర్క్ విషయంలో ఆమె చాలా కాన్ఫిడెంట్ గా ఉంటుందని శివలెంక కృష్ణప్రసాద్ అన్నారు. తన నటనతో ఎందరినో ఇన్స్పైర్ చేసిందని.. ఆమెతో కలిసి వర్క్ చేయడం మంచి ఎక్స్ పీరియన్స్ అని చెప్పుకొచ్చారు. 


సాధారణంగా అయితే సినిమా రిలీజ్ సమయంలో నిర్మాతగా తనకు చాలా టెన్షన్ వస్తుందని.. కానీ 'యశోద' అవుట్ పుట్ చూసిన తరువాత రిలాక్స్డ్ గా ఉన్నట్లు చెప్పారు. ఈ సినిమా తెలుగుతో పాటు మిగిలిన భాషల్లో కూడా బాగా ఆడుతుందనే నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు. ఆయన మాటలు వింటుంటే సినిమా కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారనిపిస్తుంది. మరి సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి!


Also Read : పక్కా ప్లానింగ్‌తో పవన్ అడుగులు - రాజకీయాలు, సినిమాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా!