నవంబర్ తొలి వారంలో పీరియాడిక్ ఫిల్మ్ 'హరి హర వీర మల్లు' (Hari Hara Veera Mallu) సినిమా సెట్స్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అడుగు పెట్టారు. ఇకపై ఎటువంటి ఆటంకాలు లేకుండా సినిమా షూటింగ్ సజావుగా, సాఫీగా జరుగుతుందని వార్తలు వచ్చాయి. అయితే... నాలుగు ఐదు రోజులు షూటింగ్ చేశారో? లేదో? పవన్ ఇప్పటం వెళ్లారు. దాంతో సినిమా షూటింగుకు మళ్ళీ బ్రేకులు పడినట్టు రూమర్స్ వచ్చాయి. అయితే... అటువంటిది ఏమీ లేదని తెలిసింది. 


మళ్ళీ మండే నుంచి...
గుంటూరులోని ఇప్పటంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన రోడ్డు వైండింగ్ పనులు వివాదాలకు దారి తీశాయి. పవన్ కళ్యాణ్ ఇప్పటం వెళ్లడం, ఆయన్ను పోలీసులు అడ్డుకోవడం మరింత ఉద్రిక్తతలకు దారి తీసింది. పవన్ ఇప్పటం పర్యటన రెండు రోజులు మాత్రమే అని, మళ్ళీ సోమవారం నుంచి ఆయన 'హరి హర వీర మల్లు' షూటింగ్ చేస్తారని యూనిట్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.


డిసెంబర్‌కు షూటింగ్ ఫినిష్!
ఇటు సినిమాలు... అటు రాజకీయాలు... రెండిటికీ ఎటువంటి ఆటంకం లేకుండా పవన్ కళ్యాణ్ ప్లానింగ్ జరుగుతోందని సమాచారం. సినిమా షూటింగ్స్ మధ్య రెండు మూడు రోజులు రాజకీయాలకు కేటాయిస్తూ... షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఏపీ అసెంబ్లీకి 2014లో ఎన్నికలు జరగనున్నాయి. అప్పటికి ఇంకా 16 నెలల సమయం ఉంది. ఎన్నికలకు ఏడాది ముందు నుంచి రాజకీయ పరమైన పనులు ఉంటాయి కాబట్టి... ఈ ఏడాది ఆఖరు లోపు, అంటే డిసెంబర్‌కు 'హరి హర వీర మల్లు' షూటింగ్ ఫినిష్ చేసేలా చూడాలని పవన్ చెప్పారట.  


నవంబర్ తొలి వారంలో పవన్ కళ్యాణ్ 'హరి హర వీర మల్లు' సెట్స్‌లో జాయిన్ అయ్యారు. ఆయనపై దర్శకుడు క్రిష్ జాగర్లమూడి భారీ యుద్ధ సన్నివేశాలు తెరకెక్కించారని తెలిసింది. భారీ సంఖ్యలో గుర్రాలు, ఇంకా వేలాది మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనగా ఆ సీన్స్ తీశారట. మళ్ళీ మండే నుంచి నెలాఖరు వరకు షూటింగ్ ప్లాన్ చేశారట. 


Also Read : ఇప్పటం పర్యటనలో పవన్ తగ్గేదేలే - అరెస్టు చేసుకోనివ్వండి అంటూ ఫైర్


ఔరంగజేబుగా బాబీ డియోల్!
లేటెస్ట్ క్రేజీ అప్‌డేట్ ఏంటంటే... 'హరి హర వీర మల్లు' సినిమాలో మొఘల్ సామ్రాజ్యాధినేత ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ హీరో బాబీ డియోల్ నటించనున్నట్లు తెలిసింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో మల్ల యోధుడు మల్లుగా పవన్ కనిపించనున్నారు. మన భారత దేశాన్ని మొఘలులు పాలించిన కాలంలో చిత్రకథ సాగుతుంది. ఈ సినిమా కోసం ఆ కాలం నాటి సెట్స్ వేశారు.



పవన్ కల్యాణ్ సరసన నిధీ అగర్వాల్ (Nidhi Agarwal) కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో నర్గిస్ ఫక్రి (Nargis Fakhri) కీలక పాత్రలో కనిపించనున్నారు.


మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో దయాకర్ రావు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. జ్ఞానశేఖర్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో సినిమా విడుదల కానుంది.