Haryana Stubble Management: 


నగదు ప్రోత్సాహకాలు కూడా..


పంజాబ్, హరియాణాలో రైతులు "గడ్డి కాల్చడం" వల్ల చుట్టు పక్కల రాష్ట్రాల్లో కాలుష్యం పెరుగుతోంది. ముఖ్యంగా ఢిల్లీలో ప్రజలు గాలి పీల్చుకోటానికి కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లోనూ ఈ సమస్య తీవ్రంగానే ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నా పూర్తి స్థాయిలో సత్ఫలితాలు రావటంలేదు. సబ్సిడీ కింద రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం పంట పొలాల్లో నుంచి గడ్డిని తొలగించే మెషీన్లను రాష్ట్రాలకు అందిస్తోంది. అటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వీటిని వినియోగిస్తున్నాయి. ఈ చర్యలు సరిపోవని భావించిన హరియాణా ప్రభుత్వం...గడ్డికి కనీస మద్దతు ధర ఇచ్చి రైతుల నుంచి కొనుగోలు చేయాలని చూస్తోంది. ఈ మేరకు ప్రత్యేకంగా ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. హరియాణా వ్యవసాయ మంత్రి జేపీ దలాల్ ఈ మేరకు
ఓ ప్రకటన కూడా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల వద్ద నుంచి గడ్డిని కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నట్టు వెల్లడించారు. ఇప్పటికే కమిటీని నియమించిన ప్రభుత్వం...ఆ సభ్యుల సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుంది. ఆ సలహాల మేరకు గడ్డిని డిస్పోస్ చేసే విధానాలపై మేధోమథనం సాగిస్తున్నారు. వీటికి ఎంత మద్దతు ధర ఇవ్వాలనేదీ నిర్ణయించనున్నారు. దీంతో పాటు రైతుల్లో అవగాహన పెంచే చర్యలనీ చేపడుతోంది హరియాణా ప్రభుత్వం. ఇప్పటికే రైతులకు 80 వేల సూపర్ సీడర్స్ యంత్రాలను అందజేసింది. పంట పొలాల్లో గడ్డి కాల్చకుండా ఉండాలని చెబుతోంది. ఈ నిబంధన పాటించిన రైతులకు హెక్టార్‌కు రూ.1000 చొప్పున నగదు ప్రోత్సాహకాన్నీ అందజేయనుంది. ఈ చర్యలతో గతేడాది కన్నా ఈ సారి హరియాణాలో "గడ్డి కాల్చుతున్న" ఘటనలు తగ్గిపోయాయి. ఇది పూర్తి స్థాయిలో నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకుంది హరియాణా. 


పంజాబ్‌లో తీవ్రం..


పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం రైతులకు భరోసా కల్పించలేకపోతోందని భాజపా ఫైర్ అవుతోంది. ఈ క్రమంలోనే అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ దారుణంగా పడిపోయిందని వెల్లడించారు. పంజాబ్‌లో గడ్డి కాల్చుతుండటాన్ని ప్రస్తావించారు. "పంజాబ్‌లో జరుగుతున్న దానికి పూర్తి స్థాయి బాధ్యత వహిస్తాం. మేము అధికారంలోకి వచ్చి కేవలం 6 నెలలు అవుతోంది. ఇప్పటి వరకూ ఎన్నో కట్టడి చర్యలు తీసుకున్నాం. వచ్చే ఏడాది నాటికి రైతులు అలా గడ్డికాల్చకుండా జాగ్రత్తపడతాం" అని హామీ ఇచ్చారు. ఇప్పుడిప్పుడే పంజాబ్‌లో శాంతి భద్రతలు అదుపులోకి వస్తున్నాయని, మిగతా సమస్యలు పరిష్కరించడానికి ఇంకాస్త సమయం ఇవ్వాలని చెప్పారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వంపైనా విమర్శలు చేశారు. "కేంద్ర ప్రభుత్వం మాకు సహకరిస్తే కలిసి కట్టుగా ఈ కాలుష్య సమస్యను పరిష్కరించేందుకు వీలవుతుంది" అని స్పష్టం చేశారు. కేవలం తమ వైపే వేలెత్తి చూపించటం సరికాదని వెల్లడించారు. "ఢిల్లీలో కాలుష్య స్థాయి ప్రమాదకరంగా మారటానికి మా ప్రభుత్వం మాత్రమే కారణం కాదు" అని చెప్పారు. 


Also Read: Mobile Phones Recovery : మీ సెల్ ఫోన్ పోయిందా? డోంట్ వర్రీ ఇలా చేస్తే మళ్లీ దొరికేస్తుంది?