PM Modi on Cheetahs:
2 చీతాలు ఎన్‌క్లోజర్‌లోకి..
నమీబియా నుంచి వచ్చిన 8 చీతాలను మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో అత్యంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు అధికారులు. అక్కడి వాతావరణానికి అలవాటు పడేలా దాదాపు 50 రోజులుగా క్వారంటైన్‌లో ఉంచారు. ఇప్పుడిప్పుడే అవి ఇక్కడి వాతావరణానికి అలవాటు పడుతున్న క్రమంలో ఓ పెద్ద ఎన్‌క్లోజర్‌లోకి రెండు చీతాలను వదిలారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ వేదికగా పంచుకున్నారు. రెండు చీతాలను ఎన్‌క్లోజర్‌లోకి విడుదల చేస్తున్న వీడియోని పోస్ట్ చేశారు. "అందరికీ ఆనందం కలిగించే వార్త ఇది. నమీబియా నుంచి తెచ్చిన 8 చీతాలు దాదాపు 50 రోజులుగా క్వారంటైన్‌లో ఉన్నాయి. అక్కడి హ్యాబిటాట్‌కు అలవాటు పడే విధంగా ఇప్పుడు ఎన్‌క్లోజర్‌లోకి పంపుతున్నారు" అని ట్వీట్ చేశారు. అన్ని చిరుతలు ఆరోగ్యంగా ఉన్నాయని వెల్లడించారు. మిగతా చీతాలను త్వరలోనే
ఎన్‌క్లోజర్‌లోకి విడుదల చేస్తామని వెల్లడించారు. మిగతా 6 చీతాలను ఈ నెల 10 వ తేదీన అధికారుల సూచనల మేరకు ఎన్‌క్లోజర్‌లోకి పంపుతారని తెలుస్తోంది. ఇటీవలే ప్రభుత్వం చీతా టాస్క్ ఫోర్స్‌ని (Cheetah Task Force) కూడా నియమించింది. ఈ 8 చీతాల సంరక్షణ బాధ్యతలను అప్పగించింది. క్వారంటైన్ నుంచి ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన చీతాల పేర్లు ఎడ్డీ, ఫ్రెల్టాన్‌గా అధికారులు తెలిపారు.
టాస్క్‌ఫోర్స్..
నమీబియా నుంచి వచ్చిన చీతాలను మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో సంరక్షిస్తున్నారు. వీటిని కాపాడుకునేందుకు గట్టి చర్యలే చేపడుతోంది కేంద్రం. ప్రస్తుతం కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ 9 మంది సభ్యులతో కూడిన ఓ టాస్క్‌ఫోర్స్‌ని నియమించింది. చీతాలను సరైన విధంగా సంరక్షించుకునే బాధ్యతల్ని...ఈ టాస్క్‌ఫోర్స్ తీసుకోనుంది. చీతాల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించడం, క్వారంటైన్‌లో ఎలా ఉంటున్నాయో పరిశీలించడం, చీతాలకు అనుకూలమైన వాతావరణం సృష్టించటం లాంటివి చేయనున్నారు. టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయటమే కాదు. చీతాల సంరక్షణకు అవసరమైన అన్ని చర్యలూ చేపడుతోంది కేంద్రం. వేటగాళ్ల నుంచి వీటికి రక్షణ కల్పించేందుకు... ప్రత్యేక శిక్షణ తీసుకున్న జర్మన్ షెపర్డ్స్ కుక్కల్ని కాపలాగా ఉంచనున్నారు. ప్రస్తుతం వీటికి ఇండో టిబెటన్ బార్డర్ వద్ద స్పెషల్ ట్రైనింగ్ ఇస్తున్నారు. కునో నేషనల్ పార్క్‌లో...చీతాలున్న చోట ఇవి కాపలా కాస్తాయి. ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి అప్రమత్తం చేస్తాయి.
పులి చర్మం, ఎముకలతో పాటు ఏనుగు తొండాన్నీ గుర్తించే విధంగా వాటికి శిక్షణ ఇస్తున్నారు. WWWF-India (World Wide Fund for Nature India) ఆధ్వర్యంలో ఈ ట్రైనింగ్ కొనసాగుతోంది. ITBPలోని బేసిక్ ట్రైనింగ్ సెంటర్‌లో ఈ శునకాలను ట్రైన్ చేస్తున్నారు. దాదాపు 7 నెలల శిక్షణ తరవాత ఇవి కాపలాకు సిద్ధమవుతాయి. పసిగట్టడం, ట్రాక్ చేయటం లాంటి నైపుణ్యాల్లో అవి ఆరితేరాకే క్షేత్రస్థాయిలోకి పంపుతారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి వీటి డ్యూటీ మొదలవుతుంది. దాదాపు 7 దశాబ్దాల తరవాత చీతాలు భారత్‌కు తిరిగి వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో వాటిని అధికారికంగా వదిలారు.