Maharashtra Politics: ఠాక్రే ప్రభుత్వం కుప్పకూలిపోవటంలో ఆశ్చర్యం ఏముంది, ఎన్నికల్లో గెలిచేది మేమే - ఫడణవీస్

Maharashtra Politics: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా తామే గెలుస్తామని ఫడణవీస్ ధీమా వ్యక్తం చేశారు.

Continues below advertisement

Maharashtra Politics:

Continues below advertisement

తప్పకుండా గెలుస్తాం: ఫడణవీస్ 

మహారాష్ట్ర రాజకీయాల్లో మూడు, నాలుగు నెలల్లో ఎన్ని మార్పులు వచ్చాయో గమనించాం. ఎవరూ ఊహించని రీతిలో ఠాక్రే ప్రభుత్వం కుప్ప కూలిపోవటం, తరవాత శిందే నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కావటం చకచకా జరిగిపోయాయి. డిప్యుటీ సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ బాధ్యతలు చేపట్టారు. నిజానికి..ఫడణవీస్ ముఖ్యమంత్రి అవుతారని భావించినా..చివరకు లెక్కలన్నీ మారిపోయాయి. శిందే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. 2024లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీనిపై ఇటీవల దేవేంద్ర ఫడణవీస్‌ కొన్ని వ్యాఖ్యలు చేసారు. సీఎం శిందే నేతృత్వంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలను సమర్థంగా ఎదుర్కొంటామని వెల్లడించారు. కచ్చితంగా తమ పార్టీ గెలుస్తుందన్న నమ్మకముందని స్పష్టం చేశారు. దొడ్డి దారిలో అధికారంలోకి వచ్చారన్న విమర్శలపైనా ఆయన స్పందించారు. "వెన్నుపోటు పొడిచినందుకు పగ తీర్చుకున్నారు" అని మహా వికాస్ అఘాడీ కూటమి పడిపోవటానికి కారణమైన నేతలపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల గురించీ ప్రస్తావించారు. శిందే నేతృత్వంలో మున్సిపల్ ఎన్నికలతో పాటు, లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలనూ ఎదుర్కొంటామని వెల్లడించారు. ఇదే సమయంలో "ఠాక్రే ప్రభుత్వం పడిపోవటంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు" అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు దేవేంద్ర ఫడణవీస్. అధిష్ఠానంతో తనతో సంప్రదింపులు జరిపిన తరవాతే...ఏక్‌నాథ్ శిందేని ముఖ్యమంత్రిగా ప్రకటించారని స్పష్టం చేశారు. మహారాష్ట్ర రాజకీయాల్లో ఉన్నత పదవిని తాను కోరుకోలేదని, కానీ అధిష్ఠానం ఆదేశాల మేరకు తాను డిప్యుటీ సీఎం పదవిని అంగీకరించానని తెలిపారు. 2024 ఎన్నికల్లో తమ పార్టీ అత్యధిక మెజార్టీ సాధించి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

మున్సిపల్ ఎన్నికలు..

శిందే, ఠాక్రే సేనల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఎన్నికల గుర్తు విషయంలో ఈ రెండు పార్టీలకూ ఎదురు దెబ్బ తగిలింది. ఇన్నాళ్లు తమ పార్టీకి ఉన్న గుర్తుని కూడా వినియోగించుకోకుండా చేసినందుకు శిందే వర్గంపై ఠాక్రే వర్గం ఆగ్రహంగా ఉంది. ఈ రాజకీయ వేడి పెరుగుతుండగానే...బృహణ్ ముంబయి కార్పొరేషన్ (BMC)ఎన్నికలు సమీపించాయి. ఈ ఎన్నికలు కూడా మహారాష్ట్ర రాజకీయాలను మరో మెట్టు ఎక్కించాయి. భాజపా, శివసేన మధ్య వైరాన్ని, దూరాన్ని ఇంకాస్త పెంచనున్నాయి. ప్రస్తుతం అక్కడి రాజకీయాలు "మరాఠీ ముస్లిం"ల చుట్టూ తిరుగుతున్నాయి. ఉద్దవ్ ఠాక్రే వర్గం "మరాఠీ ముస్లింల" మద్దతు తమకే ఉంటుందని స్పష్టం చేస్తోంది. అటు భాజపా దీన్ని కొట్టి పారేస్తోంది. అక్టోబర్ 22న శివసేన మ్యాగజైన్ "Saamana"లో ఫ్రంట్ పేజ్‌లోనే మరాఠీ ముస్లింలు తమకు మద్దతునిస్తున్నారని ప్రచురించింది. వెంటనే భాజపా స్పందించింది. ఉద్ధవ్ ఠాక్రే ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మండి పడింది. ముంబయి భాజపా అధ్యక్షుడు ఆశిష్ షెలార్ తీవ్రంగా విమర్శలు చేశారు. "ముంబయిలోని మరాఠీలు, ముస్లింలు మద్దతు కోసం ఉద్ధవ్ వర్గం తాపత్రయపడుతోంది. కానీ చాలా తెలివిగా ఈ రెండు పదాలని కలిపి మరాఠీ ముస్లింల మద్దతు తమకే ఉందని చెప్పుకుంటోంది" అని అన్నారు.  నిజానికి...మహారాష్ట్రలో రాజకీయాలు మునుపటిలా లేవు. చాలా మార్పులు వచ్చేశాయి. ఫలితంగా...ఆయా పార్టీల ఓటు బ్యాంకులోనూ మార్పులు వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పుడు ఏ వర్గం ఎటువైపు నిలుస్తుందో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉంది. 

Also Read: Twitter Blue Tick: ఇండియాలోనూ ట్విటర్ బ్లూ ఫీచర్, మరో నెల రోజుల్లో వచ్చేస్తుందన్న మస్క్!

Continues below advertisement